
విమాన ప్రయాణం చేయాలనుకునే మధ్యతరగతి ప్రజలకు టికెట్ ధరలు భారంగా మారుతున్నాయి. పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల కారణంగా ముడిచమురు ధరలు పెరగడం, దాని ప్రభావంతో విమాన ఇంధనం (ఏటీఎఫ్) ఖరీదవడంతో విమాన ఛార్జీలు భారీగా పెరిగాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది టికెట్ ధరలు 20 నుంచి 50 శాతం వరకు అధికమయ్యాయి. దీంతో విమాన ప్రయాణంపై ఆసక్తి ఉన్నవారు కూడా ఖర్చును దృష్టిలో పెట్టుకుని వెనుకడుగు వేస్తున్నారు. మరోవైపు విమానాలకు ప్రత్యామ్నాయంగా వందేభారత్ ఎక్స్‌ప్రెస్ వంటి రైళ్లను ఎంచుకుంటున్నారని ట్రావెల్ పోర్టళ్లు వెల్లడిస్తున్నాయి.
డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ తగ్గడం, నిర్వహణ ఖర్చులు పెరగడం కూడా విమానయాన సంస్థలకు భారంగా మారాయి. ప్రయాణికుల నుంచి తగినంత ఆదాయం వచ్చే మార్గాల్లోనే విమానాలను నడిపేందుకు సంస్థలు మొగ్గుచూపుతున్నాయి. డిమాండ్ తక్కువగా ఉన్న రూట్లలో సర్వీసులను తగ్గిస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో అందుబాటులో ఉన్న మొత్తం విమానాల్లో దాదాపు ఐదో వంతు కార్యకలాపాలకు దూరంగా ఉన్నట్లు అంచనా. వేగంగా విస్తరిస్తున్న భారత విమానయాన రంగంలోనూ సంస్థలు ఇప్పుడు లాభాలకే ప్రాధాన్యం ఇస్తున్నాయి.
తగ్గిన విమాన సీట్ల లభ్యత
బ్రిటన్‌కు చెందిన విమానయాన విశ్లేషణ సంస్థ ఓఏజీ గణాంకాల ప్రకారం.. ఈ ఏడాది నవంబరులో దేశీయ, అంతర్జాతీయ విమానయాన సంస్థలు భారత్‌లోని మార్గాలతో పాటు విదేశీ రాకపోకలకు కలిపి మొత్తం 2.106 కోట్ల సీట్లను అందుబాటులో ఉంచాయి. గతేడాది నవంబరుతో పోలిస్తే ఇది 3.7 శాతం తక్కువ. విమాన సర్వీసుల సంఖ్య కూడా 2025లో 1,19,752 ఉండగా.. ఈ ఏడాది 1,12,267కు పడిపోయింది. అంటే 6.2 శాతం తగ్గుదల నమోదైంది.
కరోనా తర్వాత వరుసగా మూడేళ్ల పాటు పెరుగుతూ వచ్చిన విమాన సీట్ల సామర్థ్యం ఇప్పుడు తగ్గుముఖం పట్టింది. అయితే 2022 నవంబరుతో పోలిస్తే ప్రస్తుతం సీట్ల లభ్యత 25 శాతం అధికంగానే ఉండటం గమనార్హం.
పలు సంస్థల సర్వీసుల్లో కోత
శీతాకాల విమాన షెడ్యూల్ కోసం 66 విమానాలకు అనుమతులు తీసుకున్న స్పైస్‌జెట్.. కేవలం 15 విమానాలనే నడుపుతున్నట్లు డీజీసీఏ గుర్తించింది. దీనిపై సంస్థకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. స్పైస్‌జెట్ తన సీట్ల సామర్థ్యాన్ని 29 శాతం మేర తగ్గించినట్లు అంచనా.
ఇక ఎయిరిండియా 13 శాతం, ఇండిగో 1.3 శాతం, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ 1.1 శాతం చొప్పున సీట్ల సామర్థ్యాన్ని తగ్గించుకున్నాయి. మరోవైపు ఆకాశ ఎయిర్ తన విమానాల సంఖ్యను 45కు పెంచడంతో సీట్ల లభ్యత 32 శాతం వృద్ధి చెందింది.
ప్రయాణికుల సంఖ్యలోనూ తగ్గుదల
విమాన ప్రయాణాలకు డిమాండ్ తగ్గుతున్నట్లు ప్రయాణికుల గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి సెప్టెంబరు మధ్య దేశీయ విమానాల్లో ప్రయాణించిన వారి సంఖ్య 7.86 కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 1.9 శాతం తక్కువ.
దీనికి అనుగుణంగా విమానయాన సంస్థలు కూడా తమ సీట్ల సామర్థ్యాన్ని తగ్గించాయి. దేశీయ మార్గాల్లో సీట్ల సంఖ్య 1.77 కోట్ల నుంచి 1.708 కోట్లకు పడిపోయింది. అంతర్జాతీయ మార్గాల్లోనూ 41 లక్షల నుంచి 39.8 లక్షలకు తగ్గింది. ఈ తగ్గుదల వరుసగా 4 శాతం, 3 శాతంగా ఉంది.
హైదరాబాద్‌కు తగ్గిన విమాన సర్వీసులు
విమాన సీట్ల కోత ప్రభావం ప్రధాన నగరాల విమానాశ్రయాలపైనా కనిపిస్తోంది. హైదరాబాద్‌కు రాకపోకలు సాగించే విమానాల్లో సీట్ల సామర్థ్యం 12.1 శాతం తగ్గింది. చెన్నై విమానాశ్రయంలోనూ 11.7 శాతం క్షీణత నమోదైంది. అహ్మదాబాద్, గువాహటి, కోల్‌కతా, ఢిల్లీ, గోవా, బెంగళూరు, ముంబయి విమానాశ్రయాల్లోనూ సీట్ల లభ్యత తగ్గింది. అయితే పుణె విమానాశ్రయం మాత్రం ఇందుకు మినహాయింపుగా నిలిచింది.
ఈ పరిణామాలను పరిశీలిస్తే విమానయాన సంస్థలు ప్రయాణికుల సంఖ్య కంటే ఆదాయం, లాభదాయకతకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇంధన ధరలు, నిర్వహణ వ్యయాలు తగ్గి టికెట్ ధరలు అందుబాటులోకి వస్తేనే విమాన ప్రయాణాలకు మళ్లీ డిమాండ్ పెరిగే అవకాశముంది.
