
ఆర్నబ్ తుఫాన్ నేపథ్యంలో పంటలను నష్టం నుంచి కాపాడేందుకు వ్యవసాయ ఉద్యానవన శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. ఈ మేరకు ఆయా శాఖల ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి తుఫాన్ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని సూచించారు.
గ్రామస్థాయి వ్యవసాయ సహాయకుల నుంచి ఉన్నతాధికారుల వరకు ప్రతి ఒక్కరూ రైతులకు అండగా నిలవాలని స్పష్టం చేశారు. కోతకు సిద్ధంగా ఉన్న పంటలు, ఇప్పటికే కోసిన ధాన్యం, నిల్వలు తుఫాన్‌కు దెబ్బతినకుండా రైతులకు ముందస్తు సూచనలు అందించాలని మంత్రి తెలిపారు. వాతావరణం అనుకూలించిన వెంటనే అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతుల సమస్యలను తెలుసుకోవాలని ఆదేశించారు.
నీటమునిగిన పంటలను కాపాడేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టడంతో పాటు పొలాల్లో నిలిచిన నీటిని త్వరితగతిన తొలగించేలా చూడాలన్నారు. తుఫాన్ అనంతరం పంటల పునరుద్ధరణకు అవసరమైన సాంకేతిక సహాయాన్ని రైతులకు అందించాలని అచ్చెన్నాయుడు సూచించారు. గ్రామాలవారీగా, పంటలవారీగా, రైతులవారీగా జరిగిన నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి సమగ్ర నివేదికలు సమర్పించాలని ఆదేశించారు.
అర్హులైన ప్రతి రైతుకు ప్రభుత్వ సహాయం సకాలంలో అందేలా అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. రైతులకు భరోసా కల్పించడం అధికారుల ప్రథమ కర్తవ్యమని మంత్రి స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో నిర్లక్ష్యానికి తావులేకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి తుఫాన్ ప్రభావం నుంచి పంటలను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
