
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న అక్రమాలు, హింసాత్మక ఘటనలు, నామినేషన్ల అడ్డగింతలు, అభ్యర్థులకు బెదిరింపులపై తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి చేసిన ఫిర్యాదుపై రాష్ట్ర ఎన్నికల సంఘం స్పందించింది. ఈ ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి 24 గంటల్లో నివేదిక సమర్పించాలని రాష్ట్ర డీజీపీని ఆదేశించింది.
పలుచోట్ల ఎన్నికల అక్రమాలపై ఫిర్యాదు
పుంగనూరు, పులివెందుల, కమలాపురం, బద్వేల్, రాజంపేట, యర్రగుంట్ల తదితర ప్రాంతాల్లో ఎన్నికల సమయంలో జరిగిన ఘటనలను ఎంపీ గురుమూర్తి గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. గవర్నర్ కార్యాలయం ఈ ఫిర్యాదులను రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపడంతో విచారణకు ఆదేశాలు జారీ అయ్యాయి.
పోలీసు అధికారులపైనా విచారణకు డిమాండ్
డీఐజీ కోయ ప్రవీణ్, అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కనుబిల్లి, కడప జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్‌ల విధుల నిర్వహణపైనా విచారణ జరపాలని ఎంపీ కోరినట్లు సమాచారం.
విచారణ నిష్పక్షపాతంగా నిర్వహించి, తప్పు చేసినట్లు తేలిన అధికారులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని గురుమూర్తి డిమాండ్ చేశారు. ప్రతి అభ్యర్థికి నామినేషన్ దాఖలు చేసే హక్కు ఉందని, ఆ హక్కును అడ్డుకోవడం ప్రజాస్వామ్య హక్కులకు విఘాతమని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం డీజీపీకి ఇచ్చిన 24 గంటల గడువులో ఎలాంటి నివేదిక వస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
