
అనంతపురం జిల్లా రాప్తాడులోని జిల్లా పరిషత్ పాఠశాలలో పదో తరగతి విద్యార్థినిపై జరిగిన దాడి ఘటనపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించారు. పాఠశాల తరగతి గదిలోకి ప్రవేశించిన ఓ యువకుడు చెట్లు నరికే రంపం యంత్రంతో బాలికపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనలో విద్యార్థిని తీవ్రంగా గాయపడటంపై ఆవేదన వ్యక్తం చేశారు.
బాధిత బాలిక ఆరోగ్య పరిస్థితిపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్న పవన్ కల్యాణ్ ఆమెకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని ఆదేశించారు. బాలిక కుటుంబానికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. దాడికి పాల్పడిన నిందితుడిని తక్షణమే అరెస్టు చేసి చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని అధికారులకు స్పష్టం చేశారు. ఇలాంటి అమానవీయ ఘటనలకు సమాజంలో ఎలాంటి చోటు లేదని పేర్కొన్నారు.
తరగతి గదిలోకి చొరబడి బాలికపై దాడి
కాగా శనివారం ఉదయం పాఠశాలలో గణిత పాఠం జరుగుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఉపాధ్యాయురాలు తరగతి చెబుతుండగా ఓ యువకుడు అకస్మాత్తుగా తరగతి గదిలోకి ప్రవేశించాడు. అనంతరం అక్కడున్న పదో తరగతి విద్యార్థినిపై రంపం యంత్రంతో దాడికి పాల్పడ్డాడు. ఈ హఠాత్పరిణామంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
ఈ దాడిలో బాలిక ముఖం, తల, వీపు భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన పాఠశాల సిబ్బంది ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు పాఠశాలకు చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
