Rain Alert for Andhra Pradesh and Telangana: IMD Forecasts Rainfall for the Next Three Days

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మారుతోంది. తూర్పు తెలంగాణ, దానిని ఆనుకుని ఉన్న కోస్తా ఆంధ్రప్రదేశ్‌పై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రాబోయే మూడు రోజుల పాటు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరించింది.

ప్రస్తుతం ఈ ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తాజా నివేదికలో పేర్కొంది.

ఇప్పటికే మురసు తుపాను ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. భారీ వర్షాల కారణంగా పంటలు దెబ్బతినడంతో పాటు రోడ్లు, విద్యుత్ వ్యవస్థకు నష్టం వాటిల్లింది. ప్రస్తుతం అధికారులు పునరుద్ధరణ చర్యలు చేపడుతున్నారు. ఈ సమయంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడటంతో రాష్ట్రంలో వర్షాలు కొనసాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

ఏపీలో మరో మూడు రోజులు వర్షాలు

అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలో ఈరోజు, రేపు, ఎల్లుండి అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది.

కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు సంభవించవచ్చని అధికారులు హెచ్చరించారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో, గరిష్ఠంగా 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు.

రాయలసీమ జిల్లాల్లోనూ ఈరోజు, రేపు, ఎల్లుండి ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

తెలంగాణలోనూ వర్ష సూచన

తెలంగాణలో కూడా రాబోయే రెండు రోజుల్లో వాతావరణ పరిస్థితులు మారనున్నాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం.. శుక్రవారం, శనివారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

వర్షాలతో పాటు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు.

Live Updates in DTV Digital

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

వర్షాలు, ఈదురుగాలుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. ముఖ్యంగా ఉరుములు, మెరుపులు సంభవించే సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల సమీపంలో ఉండకూడదు. ప్రయాణికులు, రైతులు వాతావరణ పరిస్థితులను గమనిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.