కృష్ణా జిల్లాలో శనివారం నిర్వహించనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను పూర్తి నిబంధనలతో, పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కౌంటింగ్‌లో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు.

ఈ మేరకు శుక్రవారం రాత్రి మచిలీపట్నంలోని తన క్యాంపు కార్యాలయం నుంచి రిటర్నింగ్‌ అధికారులు, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులు, ప్రత్యేక అధికారులు, మాస్టర్‌ ట్రైనర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కౌంటింగ్‌ ఏర్పాట్లు, అనుసరించాల్సిన విధివిధానాలపై అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా జాయింట్‌ కలెక్టర్‌ ఎం. నవీన్‌, సహాయ కలెక్టర్‌ నమ్రత అగర్వాల్‌ పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా ఓట్ల లెక్కింపు విధానాన్ని వివరించారు. స్ట్రాంగ్‌ రూమ్‌ల నుంచి బ్యాలెట్‌ బాక్సులను కౌంటింగ్‌ టేబుళ్ల వద్దకు తరలించడం, బ్యాలెట్‌ పత్రాల విభజన, ప్రారంభ లెక్కింపు, అభ్యర్థుల వారీగా ఓట్ల లెక్కింపు, ఫలితాల నమోదు వంటి అంశాలపై అవగాహన కల్పించారు.

కౌంటింగ్‌ ప్రక్రియ ఉదయం 7 గంటలకు ప్రారంభం కానున్న నేపథ్యంలో అవసరమైన అన్ని ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని కలెక్టర్‌ సూచించారు. ప్రతి టేబుల్‌పై పోస్టల్‌ బ్యాలెట్లు, ప్రారంభ లెక్కింపు, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్ల వివరాల నమోదుకు సంబంధించిన రిజల్ట్‌ షీట్లు, డిక్లరేషన్‌ ఫారాలు అందుబాటులో ఉంచాలన్నారు. బ్యాలెట్‌ పత్రాల విభజనకు పింక్‌, వైట్‌ ట్రేలు, అభ్యర్థుల వారీగా ఓట్లను వేరు చేసేందుకు ప్రత్యేక ట్రేలను సిద్ధం చేయాలని ఆదేశించారు.

అలాగే ఎంపీటీసీ, జడ్పీటీసీ బ్యాలెట్‌ బాక్సుల కోసం ప్రత్యేక డ్రమ్‌లు, రబ్బర్‌ బ్యాండ్లు, పేపర్‌ వైట్‌లు, తిరస్కరణ స్టాంపులు, ప్లేట్లు, స్టేషనరీ, పెన్నులు, ప్యాడ్లు, కాలిక్యులేటర్లు తదితర సామగ్రిని సిద్ధం చేసుకోవాలని తెలిపారు. చెల్లని ఓట్లను తిరస్కరించే సమయంలో అందుకు సంబంధించిన కారణాలను నిబంధనల ప్రకారం స్పష్టంగా నమోదు చేయాలని సూచించారు. ప్రతి కౌంటింగ్‌ టేబుల్‌కు ప్రారంభ, వివరమైన లెక్కింపు ప్రక్రియలకు అనుగుణంగా నేమ్‌ బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

కౌంటింగ్‌ హాళ్లలో టేబుల్‌ నంబర్లు, పబ్లిక్‌ అడ్రస్‌ సిస్టమ్‌, ప్రింటర్లు, ప్రత్యేక ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, మీడియా పాయింట్లు ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ సూచించారు. విధుల్లో పాల్గొనే ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా గుర్తింపు కార్డులు జారీ చేయాలని స్పష్టం చేశారు. గుర్తింపు కార్డులు లేని వారిని కౌంటింగ్‌ కేంద్రాల్లోకి అనుమతించబోమని తెలిపారు.

ప్రతి కౌంటింగ్‌ హాల్‌కు ఇద్దరు మాస్టర్‌ ట్రైనర్లను కేటాయించినట్లు వెల్లడించారు. డేటా ఎంట్రీ ఆపరేటర్లు, రిజర్వ్‌ సిబ్బంది సహా విధుల్లో పాల్గొనే ప్రతి ఒక్కరికీ గుర్తింపు కార్డులు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

కౌంటింగ్‌ కేంద్రాల్లో విధులు నిర్వహించే సిబ్బందికి ఆహారం, టీ, తాగునీరు వంటి కనీస సౌకర్యాలు కల్పించాలని సూచించారు. నిర్ణీత సమయాల్లో బిస్కెట్లు, స్నాక్స్‌ వంటి అల్పాహారాన్ని అందుబాటులో ఉంచడంతో పాటు అవసరమైన సహాయక సిబ్బందిని నియమించాలని కలెక్టర్‌ అధికారులకు సూచించారు.

By Ramya