
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అయోధ్యలో దీపావళి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. నిషాద్ సామాజిక వర్గానికి చెందిన ప్రజలతో కలిసి పండుగ సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆదివారం నిషాద్ బస్తీని సందర్శించిన ఆయన స్థానికులు చిన్నారులతో ఆప్యాయంగా ముచ్చటించారు.
వారికి దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ మిఠాయిలు పండుగ కానుకలు పంపిణీ చేశారు. సీఎం యోగితో సెల్ఫీలు దిగేందుకు స్థానికులు ఆసక్తి చూపించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో యోగి ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అయోధ్య పవిత్రత ప్రతిష్ఠకు ఎలాంటి భంగం కలగకుండా చూడాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
నగర వైభవాన్ని దెబ్బతీసే శక్తులకు మరోసారి అవకాశం ఇవ్వకూడదని స్పష్టం చేశారు. గతంలో అయోధ్యలో రామభక్తులపై కాల్పులు జరిగిన ఘటనలను ఈ సందర్భంగా సీఎం ప్రస్తావించారు. ఇకపై అయోధ్యలో శ్రీరామ భక్తులపై కాల్పులు జరిగే పరిస్థితి ఉండదని ‘జై శ్రీరామ్’ అని నినదించే భక్తులపై లాఠీచార్జీలు చేసే పరిస్థితి రాదని వ్యాఖ్యానించారు.
పదేళ్ల క్రితం అయోధ్య పేరు వినగానే ప్రజలు ముఖం తిప్పుకునేవారని ప్రస్తుతం దేశంలో ఎక్కడికి వెళ్లినా అయోధ్య ప్రజలకు గౌరవం ఆత్మీయ స్వాగతం లభిస్తోందని యోగి పేర్కొన్నారు. అయోధ్యకు వచ్చిన మార్పును ఆయన ఈ సందర్భంగా వివరించారు.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశయాలను ప్రస్తావిస్తూ సమాజంలోని అట్టడుగు వర్గాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరినప్పుడే సుపరిపాలనకు నిజమైన అర్థం ఉంటుందని సీఎం అన్నారు. ఇదే బాబాసాహెబ్ ఆశయమని పేర్కొన్నారు.
వేల సంవత్సరాల క్రితం శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వచ్చిన సందర్భాన్ని నేటి దీపావళి వేడుకలు గుర్తుచేస్తాయని యోగి తెలిపారు. అందుకే ప్రతి సంవత్సరం దీపావళిని అయోధ్యలో జరుపుకోవడానికి ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. ఈ సంప్రదాయం రాబోయే తరాలకు కూడా స్ఫూర్తినిస్తుందని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు.
