క్యాన్సర్ చికిత్స అంటే కేవలం శారీరక వేదన మాత్రమే కాదు.. ఖరీదైన మందులతో కుటుంబాలన్నీ ఆర్థికంగా కుంగిపోయే పరిస్థితి. అలాంటి రోగుల కష్టాలను తీరుస్తూ కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఏకంగా 137 రకాల ప్రాణాంతక క్యాన్సర్ ఔషధాల ధరలను 96.45 శాతం వరకు భారీగా తగ్గిస్తూ ఆదేశాలు జారీ చేసింది. వాటి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

దేశవ్యాప్తంగా క్యాన్సర్ మహమ్మారితో పోరాడుతున్న లక్షలాది మంది రోగులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. ప్రాణాంతక క్యాన్సర్ చికిత్సలో వినియోగించే 137 రకాల కీలక ఔషధాల ధరలను ఏకంగా 96.45 శాతం వరకు భారీగా తగ్గించింది. సోమవారం నుంచే ఈ నూతన ధరలు అమలులోకి వస్తున్నాయి. ఔషధాల ధరల నియంత్రణ సంస్థ అయిన నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ జారీ చేసిన ఆదేశాల ప్రకారం.. ఈ నిర్ణయంతో క్యాన్సర్ రోగులకు ఏటా దాదాపు రూ.3,540 కోట్ల మేర ఆర్థిక భారం తగ్గనుంది. తాజా ధరల సవరణలో భాగంగా మొత్తం 534 రకాల ఔషధాల ధరలు తగ్గగా అందులో పేటెంటెడ్, కాంబినేషన్లతో కూడిన 137 షెడ్యూల్డ్ క్యాన్సర్ ఔషధాలు ఉన్నాయి.

ట్రేడ్ మార్జిన్‌పై 30శాతం పరిమితి.. కొత్త రేట్ల లెక్క ఇలా..

క్యాన్సర్ మందుల రిటైల్ మార్కెట్‌లో జరుగుతున్న అధిక లాభార్జనకు చెక్ పెడుతూ NPPA స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. తయారీదారులు స్టాకిస్టులు లేదా డిస్ట్రిబ్యూటర్లకు ఇచ్చే అసలు ధరకు మార్చి 2026 నాటి డిస్ట్రిబ్యూటర్ ధరను ప్రాతిపదికగా తీసుకుంటారు. తయారీదారు ఛార్జ్ చేసే ధరకు గరిష్ఠంగా 30 శాతం ట్రేడ్ మార్జిన్ పరిమితి, వర్తించే జీఎస్టీ మాత్రమే కలిపి తుది గరిష్ఠ చిల్లర ధరను నిర్ణయించాలి. ఉదాహరణకు.. తయారీ సంస్థ ఒక ఔషధాన్ని డిస్ట్రిబ్యూటర్‌కు రూ.70కి విక్రయిస్తూ, మార్కెట్‌లో దాని పాత MRP రూ.300గా ఉంటే.. తాజా నిబంధనల ప్రకారం వర్తించే పన్నులతో కలిపి దాని ధర గణనీయంగా తగ్గి రూ.100 స్థాయికి దిగివస్తుంది. ప్రస్తుత MRP కంటే కొత్తగా లెక్కించిన ధర తక్కువగా ఉంటే తప్పనిసరిగా తగ్గించిన రేటుకే అమ్మాలి. ఒకవేళ పాత ధర కొత్త లెక్కల కన్నా తక్కువగా ఉంటే ఆ పాత ధరే కొనసాగుతుంది.

లిస్టులో కీలకమైన లైఫ్ సేవింగ్ డ్రగ్స్

వివిధ రకాల క్యాన్సర్లకు చికిత్స అందించే అత్యంత ఖరీదైన, పేటెంటెడ్ ఔషధాలను కూడా ఈ ధరల తగ్గింపు పరిధిలోకి తెచ్చారు. పెంబ్రోలిజుమాబ్, నివోలుమాబ్, ఒసిమెర్టినిబ్, పాల్బోసిక్లిబ్, అబెమాసిక్లిబ్ వంటి కీలక మందులు ఇందులో ఉన్నాయి. ఈ ఔషధాలకు సంబంధించిన అన్ని వేరియంట్లు, డోసేజ్ ఫార్ములాలు, కాంబినేషన్లకు ఈ కొత్త నిబంధనలు వర్తిస్తాయి. భవిష్యత్తులో అవసరాన్ని బట్టి ఈ జాబితాను నిరంతరం సమీక్షిస్తామని NPPA స్పష్టం చేసింది.

కొత్త ధరలను ఎలా సరిచూసుకోవాలి?

మందులు కొనుగోలు చేసే సమయంలో వినియోగదారులు మోసపోకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం పలు మార్గదర్శకాలను సూచించింది.

ఫార్మా సహీ దామ్ యాప్: రోగులు, వారి కుటుంబ సభ్యులు తమ మొబైల్స్‌లో ఈ అధికారిక యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, తాము కొనుగోలు చేస్తున్న ఔషధం కొత్త MRPని నేరుగా చెక్ చేసుకోవచ్చు.

అధిక ధరలకు అమ్మితే ఫిర్యాదు చేయండి: ఒకవేళ మెడికల్ షాపులు లేదా రిటైలర్లు తగ్గించిన ధరల ప్రయోజనాన్ని రోగులకు బదిలీ చేయకుండా, పాత రేట్లకే విక్రయిస్తూ అధిక ధరలు వసూలు చేస్తే వెంటనే ఫిర్యాదు చేయవచ్చు.

టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్: వినియోగదారులు నేరుగా 1800-111-255 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు నమోదు చేయవచ్చని అధికారులు వెల్లడించారు.

By Hemanth

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *