
ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగానికి భారీ పెట్టుబడులు రానున్నాయి. శ్రీకాకుళం జిల్లా మూలపేటలో రూ.13,500 కోట్లతో గెయిల్, క్రిబ్కో సంస్థలు భారీ యూరియా ప్లాంట్ ఏర్పాటు చేయనున్నాయి. ఏడాదికి 1.27 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఈ పరిశ్రమను నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఇందుకోసం సుమారు 700 ఎకరాల భూమి అవసరమవుతుంది. ఏపీఈడీబీతో త్వరలోనే ఎంవోయూ చేసుకోనున్నారు.
ఈ ప్లాంట్ ద్వారా 300 నుంచి 400 మందికి ప్రత్యక్షంగా, మరో వెయ్యి మందికి పరోక్షంగా ఉపాధి లభించనుంది. రాష్ట్ర ప్రభుత్వం భూమితో పాటు రోడ్లు, విద్యుత్, నీరు, రైల్వే కనెక్టివిటీ వంటి మౌలిక సదుపాయాలను కల్పించనుంది. ప్లాంట్ అందుబాటులోకి వస్తే దేశీయ యూరియా ఉత్పత్తి పెరిగి దిగుమతులపై ఆధారపడటం తగ్గే అవకాశం ఉంది.
మరోవైపు తిరుపతి జిల్లా నాయుడుపేటలో రూ.4 వేల కోట్లతో బ్యాటరీ ముడిపదార్థాల తయారీ పరిశ్రమ ఏర్పాటు కానుంది. భారత్కు చెందిన కార్బన్ రిసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్, దక్షిణ కొరియాకు చెందిన కాస్మో ఏఎంఅండ్టీ సంస్థలు సంయుక్తంగా ఈ పరిశ్రమను నెలకొల్పనున్నాయి. దీని ద్వారా 700 మందికి ప్రత్యక్షంగా, 5 వేల మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
విశాఖపట్నంలో జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో మంత్రి నారా లోకేశ్ సంస్థల ప్రతినిధులతో సమావేశమై పెట్టుబడులు, పరిశ్రమ ఏర్పాటు, ఉత్పత్తి సామర్థ్యం, భవిష్యత్తు విస్తరణ ప్రణాళికలపై చర్చించారు.
ఈ రెండు ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రానికి రూ.17,500 కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉండటంతో పాటు వేలాది మందికి ఉపాధి లభించనుంది. రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి ఇవి కీలకంగా మారనున్నాయి.
