
ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికల వేళ ఏకగ్రీవాలపై చర్చలు మొదలయ్యాయి. సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకుంటే గ్రామాభివృద్ధికి భారీగా నిధులు ఇస్తామని కొందరు ముందుకొస్తున్నారు. దీంతో గోదావరి జిల్లాల్లో కోట్ల రూపాయల ఆఫర్లు చర్చనీయాంశంగా మారాయి.
పశ్చిమగోదావరి జిల్లా ఆచంట ప్రాంతంలోని ఓ గ్రామంలో తనను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే గ్రామాభివృద్ధికి రూ.2 కోట్లు ఇస్తానని ఓ వ్యక్తి ప్రకటించినట్లు సమాచారం. అలాగే తూర్పుగోదావరి జిల్లా కడియం మండలంలోని ఓ గ్రామంలో రూ.కోటి విరాళం ఇస్తానని మరో వ్యక్తి ప్రకటించినట్లు తెలుస్తోంది.
నరసాపురంలో భారీ ఆఫర్లు
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలంలోని ఓ గ్రామంలో పెద్దల సమక్షంలో ఏకగ్రీవంపై చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా ఓ అభ్యర్థి రూ.50 లక్షలు ఇస్తానని, మరో అభ్యర్థి ఎకరం పొలం ఇస్తానని ప్రతిపాదించినట్లు సమాచారం.
చిత్తూరు జిల్లాలో వేలం పాటలు
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనూ ఏకగ్రీవాల కోసం రచ్చబండ సమావేశాలు నిర్వహిస్తున్నారు. సత్యవేడు మండలంలోని ఓ పంచాయతీలో సర్పంచ్ పదవికి వేలం పాట నిర్వహించగా రూ.15 లక్షల వరకు చేరినట్లు తెలుస్తోంది. అయితే గ్రామ పెద్దలు వెంటనే వేలాన్ని నిలిపివేశారు.
మొత్తంగా పంచాయతీ ఎన్నికలకు ముందే ఏకగ్రీవాల ప్రతిపాదనలు, భారీ ఆర్థిక హామీలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
