
నవంబర్ 15, 16 తేదీల్లో ప్రత్యేక సర్వీసులు.. ప్రయాణికులకు ఊరట
దీపావళి పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రయాణికుల సౌకర్యార్థం విశాఖపట్నం–సికింద్రాబాద్, తిరుపతి–సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.
విశాఖపట్నం–సికింద్రాబాద్ ప్రత్యేక రైళ్లు
విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వెళ్లే రైలు (08517) నవంబర్ 15న మధ్యాహ్నం 3.50 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8 గంటలకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో సికింద్రాబాద్ నుంచి (08518) నవంబర్ 16న రాత్రి 8 గంటలకు బయలుదేరి నవంబర్ 17న మధ్యాహ్నం 12.05 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.
ఈ రైళ్లు దువ్వాడ, అనకాపల్లి, సామర్లకోట, రాజమండ్రి, భీమవరం టౌన్, గుడివాడ, విజయవాడ, గుంటూరు, మిర్యాలగూడ, నల్గొండ, చర్లపల్లి స్టేషన్లలో ఆగుతాయి. మొత్తం 19 కోచ్‌లతో ఈ రైలును నడపనున్నారు.
తిరుపతి–సికింద్రాబాద్ ప్రత్యేక రైళ్లు
తిరుమల శ్రీవారి భక్తులు, ఇతర ప్రయాణికుల సౌకర్యార్థం తిరుపతి–సికింద్రాబాద్ మధ్య కూడా ప్రత్యేక రైళ్లను ప్రకటించారు. తిరుపతి నుంచి సికింద్రాబాద్ వెళ్లే రైలు (07421) నవంబర్ 15న సాయంత్రం 4.30 గంటలకు బయలుదేరి నవంబర్ 16న ఉదయం 7 గంటలకు చేరుకుంటుంది.
తిరుగు ప్రయాణంలో సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వెళ్లే రైలు (07422) నవంబర్ 16న సాయంత్రం 4.15 గంటలకు బయలుదేరి నవంబర్ 17న ఉదయం 6.45 గంటలకు తిరుపతి చేరుకుంటుంది.
దీపావళి సందర్భంగా ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు రైల్వేశాఖ తీసుకున్న ఈ నిర్ణయంతో ఏపీ, తెలంగాణ ప్రయాణికులకు ప్రయోజనం కలగనుంది. ప్రయాణికులు రైళ్ల సమయాలు, టికెట్ లభ్యతను ముందుగా పరిశీలించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
