ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. కాకినాడకు చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ కాద వెంకటరమణ తన కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్సార్‌సీపీలో చేరారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వెంటనే డాక్టర్ వెంకటరమణ భార్య కాద సత్యశ్రీని కాకినాడ మేయర్ అభ్యర్థిగా జగన్ ప్రకటించారు.

డాక్టర్ కాద వెంకటరమణ గతంలో తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపడంతో పాటు 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో రామచంద్రపురం నియోజకవర్గం నుంచి టీడీపీ టికెట్ కోసం ప్రయత్నించారు. అయితే ఆయనకు టికెట్ దక్కలేదు. తాజాగా ఆయన వైఎస్సార్‌సీపీలో చేరడం, ఆయన భార్యకు కాకినాడ మేయర్ అభ్యర్థిగా అవకాశం కల్పించడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.

ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు కురసాల కన్నబాబు, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇతర మేయర్, జెడ్పీ పదవులకు కూడా అభ్యర్థుల ప్రకటన

రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న కాకినాడ, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్లతో పాటు 19 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించింది. ఈ నెల 26న పోలింగ్, 30న ఓట్ల లెక్కింపు జరగనుంది.

ఇప్పటికే శ్రీకాకుళం మేయర్ అభ్యర్థిగా ఇటీవల టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవిని జగన్ ప్రకటించారు.

అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ అభ్యర్థిగా పెదబయలు జెడ్పీటీసీ సభ్యురాలు వంతల శాంతిని, వైస్ ఛైర్‌పర్సన్ అభ్యర్థిగా పాడేరు జెడ్పీటీసీ సభ్యుడు సీదరి రాంబాబును ప్రకటించారు.

ఈ మేరకు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జిల్లాకు చెందిన వైఎస్సార్‌సీపీ నేతలు, ఇటీవల ఎన్నికైన జెడ్పీటీసీ సభ్యులు జగన్‌ను కలిశారు. ఈ సమావేశంలో అరకు ఎంపీ గుమ్మ తనూజారాణి, ఎమ్మెల్సీ కుంభా రవిబాబు, ఎమ్మెల్యేలు ఎం.విశ్వేశ్వరరాజు, రేగం మత్స్యలింగం, వైఎస్సార్‌సీపీ ప్రాంతీయ సమన్వయకర్త కురసాల కన్నబాబు, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ తదితరులు పాల్గొన్నారు.

మొత్తంగా మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ మేయర్, జెడ్పీ పదవులకు అభ్యర్థులను ప్రకటిస్తూ ఎన్నికల కార్యాచరణను వేగవంతం చేస్తోంది.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *