
తిరుమలకు కాలినడకన వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంపై టీటీడీ ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా టీటీడీ అదనపు ఈవో సీహెచ్. వెంకయ్య చౌదరి అలిపిరి నడక మార్గాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మాధవ నిలయం (పీఏసీ-2) నుంచి జీఎన్సీ టోల్గేట్ వరకు నడక మార్గంలో పర్యటించి భక్తులకు అందుతున్న సౌకర్యాలను సమీక్షించారు.
నడక మార్గంలో దర్శనం, ఉచిత వసతి తదితర వివరాలను భక్తులకు సులభంగా తెలిసేలా సమాచార బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మార్గంలోని దుకాణాలను తనిఖీ చేసి తాగునీరు, తినుబండారాలను టీటీడీ నిర్దేశించిన ధరలకే విక్రయించాలని స్పష్టం చేశారు. దుకాణాల వద్ద ఎలాంటి ఆక్రమణలు ఉండకూడదని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో ఎస్ఈ-2 వేణుగోపాల్, డిప్యూటీ ఈవోలు వెంకటేశ్వర్లు, సోమన్నారాయణ, డీఈ చంద్రశేఖర్ తదితర అధికారులు పాల్గొన్నారు.
భక్తుల అభిప్రాయాలు, ఫిర్యాదుల పరిష్కారంపై సమీక్ష
మరోవైపు తిరుమలలో భక్తులకు అందిస్తున్న సేవలు, సౌకర్యాలపై భక్తుల నుంచి అభిప్రాయాలు సేకరించే విధానం, ఫిర్యాదుల పరిష్కారంపై అదనపు ఈవో సీహెచ్. వెంకయ్య చౌదరి సమీక్ష నిర్వహించారు. తిరుమలలోని పద్మావతి అతిథి గృహం సుధర్మ సమావేశ మందిరంలో ఈ సమావేశం జరిగింది.
భక్తుల అభిప్రాయాలు, సూచనలను ఎప్పటికప్పుడు సేకరించి, వాటి ఆధారంగా సేవల్లో అవసరమైన మార్పులు చేపట్టాలని అధికారులకు సూచించారు. అన్నప్రసాదం కేంద్రంలో భక్తులకు అవసరమైన సమాచారం అందించేందుకు ప్రత్యేక రిసెప్షన్ కౌంటర్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నీరు, విద్యుత్ పొదుపుపై భక్తులకు అవగాహన కల్పించాలని, వనరుల వృథాను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
వసతి సముదాయాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంతో పాటు పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. భక్తులకు సేవలందించే నందకం యాప్ పనితీరును ప్రతిరోజూ పర్యవేక్షించాలని, అందులో తలెత్తే సాంకేతిక సమస్యలను 24 గంటల్లోపు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
అలాగే లగేజీ కౌంటర్ల వద్ద భక్తుల భద్రత, సౌకర్యాల కోసం సీసీటీవీ కెమెరాలు, ఫిర్యాదుల పెట్టెలు ఏర్పాటు చేయాలని సూచించారు. భక్తుల నుంచి వచ్చే అభిప్రాయాలు, ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా సత్వరమే పరిష్కరించాలని తెలిపారు.
భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, భక్తుల సంతృప్తికి అనుగుణంగా టీటీడీ సేవల నాణ్యతను నిరంతరం పెంచాలని అదనపు ఈవో సీహెచ్. వెంకయ్య చౌదరి స్పష్టం చేశారు.
