ఆంధ్రప్రదేశ్‌కు మరో తుఫాన్ ముప్పు పొంచి ఉందా? బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే సూచనలు కనిపిస్తుండటంతో వాతావరణ శాఖ అప్రమత్తమైంది. దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలో నవంబర్ 13వ తేదీ నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ అల్పపీడనం బలపడి తుఫాన్‌గా మారుతుందా లేదా అనే దానిపై నవంబర్ 15 నాటికి స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఒకవేళ తుఫాన్‌గా మారితే ఇరాన్ సూచించిన ‘అక్వాన్’ అనే పేరును ఖరారు చేయనున్నారు.

అల్పపీడనం దిశపై కొనసాగుతున్న ఉత్కంఠ

సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు, వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉంది. ప్రస్తుతం వాతావరణ శాఖ అధికారులు ఈ పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నారు. ప్రాథమిక అంచనాల ప్రకారం ఈ అల్పపీడనం తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర వైపు కదిలే అవకాశముంది. మరోవైపు పశ్చిమ బంగాళాఖాతంలోకి ప్రవేశించిన తర్వాత దిశ మార్చుకునే అవకాశాన్ని కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. బంగాళాఖాతంలోనే బలపడి మయన్మార్ తీరం వైపు పయనించే అవకాశం కూడా ఉందని అంచనా వేస్తున్నారు.

అయితే అల్పపీడనం ప్రయాణించే దిశ, తీవ్రత, తుఫాన్‌గా మారే అవకాశాలపై ఇప్పుడే స్పష్టమైన నిర్ణయానికి రాలేమని వాతావరణ పరిస్థితులను బట్టి తదుపరి అంచనాలు వెలువడనున్నాయి.

వరుస తుఫాన్లతో ఇప్పటికే నష్టపోయిన ఏపీ

ఇప్పటికే అక్టోబర్, నవంబర్ నెలల్లో తుఫాన్ల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు తీర ప్రాంతాలు ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. గతంలో వచ్చిన తుఫాన్ల కారణంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు, ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడగా, మరికొన్ని చోట్ల పంటలు దెబ్బతిన్నాయి.

ఈ నేపథ్యంలో కొత్త అల్పపీడనంపై ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ప్రభుత్వ యంత్రాంగాలు అప్రమత్తంగా ఉన్నాయి. సముద్రంలో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. అల్పపీడనం తీవ్రత పెరిగితే తీర ప్రాంత ప్రజలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసే అవకాశం ఉంది.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *