
చెన్నై శివారు ప్రాంతమైన గూడువాంచెరిలో ఆదివారం రాత్రి చోటుచేసుకున్న ఓ ఘటన తీవ్ర కలకలం రేపింది. ఇంజిన్ ఆన్‌లో ఉంచి నిలిపిన కారును ఓ దొంగ చోరీ చేశాడు. అయితే కారులో వెనుక సీట్లో 12 ఏళ్ల బాలిక నిద్రిస్తున్న విషయాన్ని అతడు గుర్తించలేదు. దీంతో బాలిక కారులోనే ఉండగా దాదాపు 230 కిలోమీటర్ల దూరం ప్రయాణించాడు.
సోమవారం తెల్లవారుజామున మైలాడుతురై జిల్లా సిర్కాళి కొత్త బస్టాండ్ వద్దకు చేరుకున్న తర్వాత వెనుక సీట్లో బాలిక ఉండటాన్ని గమనించిన నిందితుడు ఒక్కసారిగా కంగుతిన్నాడు. ఏం చేయాలో తెలియక బాలికకు టీ తీసుకొస్తానని చెప్పి కారు నుంచి బయటకు వెళ్లాడు. ఇదే అదనుగా భావించిన బాలిక అప్రమత్తంగా వ్యవహరించి అక్కడి నుంచి తప్పించుకుంది. వెంటనే సమీపంలోని ఆటో డ్రైవర్లను ఆశ్రయించి సహాయం కోరింది.
తమిళనాడు రాజధాని చెన్నై శివారులో సినిమా కథను తలపించే ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓ దొంగ ఎవరికీ అనుమానం రాకుండా కారును చోరీ చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. కారు డోర్ తెరిచి ఇంజిన్ స్టార్ట్ చేసి నెమ్మదిగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే కారులో వెనుక సీట్లో ఓ 12 ఏళ్ల బాలిక నిద్రిస్తున్న విషయాన్ని ఏమాత్రం గుర్తించలేదు.
అలా కారును నడుపుకుంటూ ఏకంగా 230 కిలోమీటర్ల దూరం ప్రయాణించాడు. ఎలాంటి ఇబ్బంది లేకుండా కారు తన చేతికి చిక్కిందని సంబరపడుతున్న సమయంలో అతడికి ఊహించని షాక్ తగిలింది. వెనుక సీట్లో నిద్రిస్తున్న బాలికను చూసి ఒక్కసారిగా కంగుతిన్నాడు. అంతదూరం ప్రయాణించే వరకు బాలికను గమనించకపోవడం ఈ ఘటనలో ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆ తర్వాత ఏం జరిగింది? బాలిక ఆ దొంగ చెర నుంచి ఎలా బయటపడింది? అన్నది ఆసక్తికరంగా మారింది.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. శివగంగ జిల్లా కముతి ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి తన భార్య, 12 ఏళ్ల కుమార్తెతో కలిసి స్వగ్రామానికి వెళ్లి తిరిగి గూడువాంచెరిలోని తమ నివాసానికి కారులో బయలుదేరారు. ప్రయాణంలో కుమార్తె వెనుక సీట్లో నిద్రలోకి జారుకుంది. మార్గమధ్యంలో గూడువాంచెరి సమీపంలోని వల్లంచెరి వద్ద ఉన్న తమ క్లౌడ్ కిచెన్ దగ్గర భోజనం చేసేందుకు దంపతులు కారును నిలిపారు. కుమార్తె నిద్రపోతుండటంతో ఆమెను కారులోనే ఉంచి, ఇంజిన్ ఆఫ్ చేయకుండానే ఇద్దరూ బయటకు వెళ్లారు.
ఇదే అదనుగా భావించిన ఓ గుర్తుతెలియని వ్యక్తి ఎవరూ గమనించని సమయంలో కారులోకి ప్రవేశించి వాహనంతో సహా అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే వెనుక సీట్లో చిన్నారి నిద్రిస్తున్న విషయాన్ని అతడు గుర్తించలేదని పోలీసులు భావిస్తున్నారు.
సుమారు అరగంట తర్వాత భోజనం ముగించుకుని తిరిగి వచ్చిన దంపతులకు కారు కనిపించలేదు. అందులోనే ఉన్న తమ కుమార్తె కూడా కనిపించకపోవడంతో వారు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించకపోవడంతో బాలిక తండ్రి వెంటనే గూడువాంచెరి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.
దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు బాలికను క్షేమంగా రక్షించడంతో పాటు చోరీకి గురైన కారును గుర్తించేందుకు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. పరిసర ప్రాంతాల్లోని వ్యాపార సముదాయాల సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. కారును దొంగిలించిన మార్గాన్ని గుర్తించేందుకు రహదారులపై ప్రయాణించిన వాహనాల వివరాలను కూడా సేకరించడం ప్రారంభించారు.
కారును చోరీ చేసి పరారైన నిందితుడు సోమవారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో మైలాడుతురై జిల్లాలోని సిర్కాళి కొత్త బస్టాండ్ ప్రాంతానికి చేరుకున్నాడు. గూడువాంచెరి నుంచి దాదాపు 230 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత వెనుక సీట్లో నిద్రిస్తున్న 12 ఏళ్ల బాలికకు మెలకువ వచ్చింది. కారులో తనతో పాటు ఓ చిన్నారి ఉండటాన్ని గమనించిన నిందితుడు ఒక్కసారిగా కంగుతిన్నాడు. ఆమెను మభ్యపెట్టేందుకు టీ కొనిస్తానంటూ చెప్పి కారు దిగి బయటకు వెళ్లాడు.
అయితే నిందితుడు కారు నుంచి బయటకు దిగగానే అప్రమత్తమైన బాలిక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వాహనం నుంచి బయటకు పరుగెత్తింది. వెంటనే సమీపంలోని బస్టాండ్ వద్ద ఉన్న ఆటో డ్రైవర్ల వద్దకు చేరుకుని తనకు ఎదురైన పరిస్థితిని వివరించింది.
బాలిక చెప్పిన విషయాలు విన్న ఆటో డ్రైవర్లు అప్రమత్తమై నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. అయితే వారి ప్రయత్నాలను గమనించిన దొంగ వెంటనే తిరిగి కారులోకి ఎక్కి అక్కడి నుంచి వేగంగా పరారయ్యాడు. దీంతో అతడిని పట్టుకునే అవకాశం చేజారింది.
కారులో బాలిక ఉన్న విషయం నిందితుడికి ఎప్పుడు, ఎలా తెలిసిందనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే ప్రమాదకర పరిస్థితుల్లోనూ బాలిక సమయస్ఫూర్తితో వ్యవహరించి తప్పించుకోవడంతో పెను ప్రమాదం తప్పిందని పోలీసులు పేర్కొన్నారు.
