
తిరుమల: కార్తీక మాసం శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించనున్న పుష్పయాగానికి అవసరమైన పుష్పాల ఊరేగింపు సోమవారం వైభవంగా జరిగింది. తిరుమలలోని కల్యాణవేదిక వద్ద ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో పుష్పాలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వాటిని ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకువచ్చారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్, ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో భాస్కర్, ఉద్యానవన విభాగం డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు, ఉద్యానవన సిబ్బంది, శ్రీవారి సేవకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ.. బ్రహ్మోత్సవాల సమయంలో తెలియక జరిగిన దోషాల నివారణార్థం కార్తీక మాసంలో శ్రీవారి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం రోజున పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని తెలిపారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్వామివారు, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు పుష్పయాగం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
ఈ యాగంలో 16 రకాల పుష్పాలు, 6 రకాల పత్రాలను వినియోగించనున్నట్లు తెలిపారు. తమిళనాడు నుంచి 5 టన్నులు, కర్ణాటక నుంచి 2 టన్నులు, ఆంధ్రప్రదేశ్ నుంచి 2 టన్నులు కలిపి మొత్తం 9 టన్నుల పుష్పాలను దాతలు విరాళంగా అందించినట్లు ఈవో వివరించారు.
