
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామ పరిధిలోని తాడివారి మెరక వద్ద మంగళవారం తెల్లవారుజామున సీఎన్జీ గ్యాస్ లీకేజీ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనతో ముందస్తు జాగ్రత్తగా కిలోమీటరు పరిధిలో నివసిస్తున్న సుమారు 200 కుటుంబాలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
గతంలో మూసివేసిన ఓఎన్జీసీ రీ డ్రిల్లింగ్ పాయింట్ వద్ద పనులు చేపడుతుండగా భారీ శబ్దంతో గ్యాస్ వెలువడినట్లు సమాచారం. గ్యాస్ లీకేజీతో పాటు పెద్ద శబ్దాలు రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న ఓఎన్జీసీ నిపుణులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని లీకేజీ నియంత్రణకు చర్యలు చేపట్టారు.
గ్యాస్ పరిసర గ్రామాల వైపు వ్యాపిస్తుండటంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. జిల్లా కలెక్టర్ మహేశ్‌కుమార్, ఎస్పీ రాహుల్ మీనా, ఇతర ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
మంటలు వ్యాపించకుండా చర్యలు
గ్యాస్ బ్లోఅవుట్ ప్రాంతంలో మంటలు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది చర్యలు చేపట్టారు. బావి చుట్టూ మంటలు వ్యాపించకుండా వాటర్ అంబ్రెల్లా ఏర్పాటు చేశారు. గ్యాస్ లీకేజీని నియంత్రించేందుకు ఓఎన్జీసీ నిపుణులు, సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారు.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు, హోంమంత్రి వంగలపూడి అనిత, మంత్రి అచ్చెన్నాయుడు స్పందించారు. యుద్ధప్రాతిపదికన సహాయక, నివారణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
మరోవైపు, అనుభవం లేని కంపెనీలకు ఓఎన్జీసీ పనులు అప్పగించడం వల్లే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని ఎమ్మెల్యే సత్యనారాయణ విమర్శించారు.
