
D news:nov:17చలికాలంలో వాయు కాలుష్యం, పొగమంచు ఎక్కువైనప్పుడు కళ్లకు సంబంధించిన సమస్యలు సాధారణంగా కనిపిస్తుంటాయి. కళ్లలో మంట, అధికంగా నీరు కారడం, ఏదో నలుసు పడినట్లు గరగరగా అనిపించడం వంటి ఇబ్బందులు చాలామందిని వేధిస్తాయి. అయితే వీటిని కేవలం కాలుష్యం వల్ల కలిగే సాధారణ సమస్యలుగా భావించి నిర్లక్ష్యం చేయకూడదు. కొన్ని సందర్భాల్లో ఇవి కంటి ఆరోగ్యానికి సంబంధించిన తీవ్రమైన సమస్యలకు సంకేతాలు కావచ్చు. ముఖ్యంగా చూపులో ఏవైనా మార్పులు కనిపించినా, లక్షణాలు ఎక్కువకాలం కొనసాగినా వెంటనే కంటి వైద్యులను సంప్రదించడం మంచిది.
మన కళ్లు నిరంతరం బయటి వాతావరణానికి బహిర్గతమయ్యే సున్నితమైన అవయవాలు. కళ్ల ఉపరితలాన్ని రక్షించే కన్నీటి పొరపై గాలి కాలుష్యం ప్రభావం చూపుతుంది. గాలిలోని సూక్ష్మ ధూళి కణాలు, పొగ, నైట్రోజన్ డయాక్సైడ్, ఓజోన్ వంటి కాలుష్య కారకాలు కళ్లపై పేరుకుపోయి చికాకు కలిగిస్తాయి. అంతేకాకుండా అలర్జీలను ప్రేరేపించి, కన్నీళ్లు త్వరగా ఆవిరయ్యేలా చేస్తాయి. ఫలితంగా కళ్లలో పొడిబారడం, మంట, వాపు వంటి సమస్యలు తలెత్తుతాయి. కళ్లలో ఎరుపు, దురద, నీరు కారడం, ఏదో నలుసు పడినట్లు అనిపించడం, కనురెప్పలు బరువుగా ఉండటం ప్రధాన లక్షణాలు. కొన్నిసార్లు రెప్పలు ఆర్పిన తర్వాత తగ్గిపోయే స్వల్ప అస్పష్టత కూడా కనిపించవచ్చు. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో పొగమంచు, కాలుష్య తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఈ సమస్యలు మరింత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది.
వాయు కాలుష్యం కారణంగా కళ్లలో ఏర్పడే అసౌకర్యాన్ని తగ్గించుకోవడానికి కొన్ని జాగ్రత్తలు పాటించాలి. కళ్లను చేతులతో రుద్దకూడదు. బయట నుంచి ఇంటికి వచ్చిన వెంటనే ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. మూసుకున్న కనురెప్పలపై మాత్రమే శుభ్రమైన నీటిని చల్లుకోవాలి. కళ్లలోకి నేరుగా నీటిని చిమ్మకూడదు. వైద్యుల సూచన మేరకు సంరక్షక పదార్థాలు లేని కందెన కంటి చుక్కలను ఉపయోగించవచ్చు. దురద, మంట ఎక్కువగా ఉన్నప్పుడు మూసుకున్న కనురెప్పలపై కొద్దిసేపు శుభ్రమైన చల్లని వస్త్రాన్ని ఉంచుకోవాలి. బయటకు వెళ్లేటప్పుడు కళ్లను పూర్తిగా కప్పే సన్‌గ్లాసెస్ లేదా రక్షణ కళ్లద్దాలు ధరించడం మంచిది. కాలుష్యం ఎక్కువగా ఉన్న రోజుల్లో కాంటాక్ట్ లెన్స్‌లకు బదులుగా సాధారణ కళ్లద్దాలు ఉపయోగించాలి. ఇంటి కిటికీలను మూసి ఉంచడం, గదిలో గాలి శుద్ధి చేసే పరికరాలను వినియోగించడం కూడా ప్రయోజనకరం. కంప్యూటర్, మొబైల్ తెరలను ఎక్కువసేపు చూసేవారు మధ్యమధ్యలో విరామం తీసుకోవాలి.
కళ్ల ఎరుపును తాత్కాలికంగా తగ్గించే చుక్కలు, గతంలో ఉపయోగించిన స్టెరాయిడ్ లేదా యాంటీబయాటిక్ మందులను వైద్యుల సలహా లేకుండా వాడకూడదు. ముఖ్యంగా స్టెరాయిడ్ కంటి చుక్కల వల్ల కంటిలో ఒత్తిడి పెరిగి చూపు నాడి దెబ్బతినే ప్రమాదం ఉంది. కొన్ని సందర్భాల్లో తగని మందుల వినియోగం ఇన్ఫెక్షన్లను మరింత తీవ్రతరం చేయవచ్చు. సాధారణంగా కాలుష్య ప్రభావం నుంచి దూరంగా ఉన్న తర్వాత ఒకటి రెండు రోజుల్లో అసౌకర్యం తగ్గుముఖం పట్టాలి. అయితే తీవ్రమైన కంటి నొప్పి, చూపు మసకబారడం, వెలుతురు చూడలేకపోవడం, పసుపు లేదా ఆకుపచ్చ రంగులో చిక్కని స్రావం రావడం, ఒక కంటిలో అధికంగా ఎరుపు కనిపించడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే కంటి వైద్యుడిని సంప్రదించాలి. రెండు మూడు రోజులైనా సమస్య తగ్గకపోతే వైద్య పరీక్షలు చేయించుకోవాలి. కాంటాక్ట్ లెన్స్‌లు ఉపయోగించేవారికి కంటిలో నొప్పి లేదా ఎరుపు కనిపిస్తే అదే రోజు వైద్య పరీక్ష అవసరం. వెలుతురు చుట్టూ వలయాలు కనిపించడం, తలనొప్పితోపాటు కంటి నొప్పి, వికారం వంటి లక్షణాలు కనిపిస్తే కంటిలో ఒత్తిడి అకస్మాత్తుగా పెరిగినట్లు సూచించే అవకాశం ఉంది. పిల్లలు, వృద్ధులు, కాంటాక్ట్ లెన్స్‌లు వాడేవారు, కళ్ల పొడిబారడం లేదా అలర్జీ సమస్యలు ఉన్నవారు మరింత అప్రమత్తంగా ఉండాలి. సాధారణ అసౌకర్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ముఖ్యంగా చూపుపై ప్రభావం కనిపించినప్పుడు కాలుష్యం తగ్గే వరకు వేచి చూడకుండా తక్షణమే వైద్య పరీక్షలు చేయించుకోవాలి.
