
తిరుమల: టీటీడీ విజిలెన్స్ విభాగంలోని సెక్యూరిటీ, విజిలెన్స్ గార్డు పోస్టుల ప్రత్యక్ష నియామకాలకు సంబంధించి కీలక స్పష్టత ఇచ్చింది. మాజీ సైనికులు, పౌరుల మధ్య ప్రస్తుతం అమలులో ఉన్న 1:2 నియామక నిష్పత్తిని రద్దు చేస్తూ టీటీడీ సాధికార మండలి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడించింది.
ఈ నిష్పత్తిలో మార్పులు చేసి కొత్త విధానంలో నియామకాలు చేపట్టాలనే అంశం ప్రస్తుతం ప్రతిపాదన దశలోనే ఉందని టీటీడీ తెలిపింది. దీనిపై ఇంకా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది. గతంలో అమలులో ఉన్న నియామక విధానమే ప్రస్తుతం కూడా కొనసాగుతోందని, నిబంధనల్లో ఎలాంటి మార్పులు చేయలేదని పేర్కొంది.
ఈ అంశంపై వస్తున్న ప్రచారాల నేపథ్యంలో అభ్యర్థులు, ప్రజలు ఎలాంటి అపోహలకు గురికావద్దని టీటీడీ విజ్ఞప్తి చేసింది. అసత్య ప్రచారాలను నమ్మవద్దని స్పష్టం చేసింది.
