
అమరావతి: న్యాయమైన, సమగ్రమైన కుల గణనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) సంపూర్ణ మద్దతు ఇస్తుందని పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆల్ ఇండియా కుల గణన సమన్వయ కమిటీ ప్రతినిధి బృందంతో సమావేశమైన ఆయన, కుల గణనకు సంబంధించిన అంశాలు, వివిధ వర్గాల ఆందోళనలపై చర్చించారు. ఈ భేటీ వివరాలను ఆయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
సామాజిక న్యాయం సాధించాలంటే సమగ్ర, సుస్థిర, సమాన అభివృద్ధికి దోహదపడేలా వాస్తవ గణాంకాల ఆధారంగా విధాన నిర్ణయాలు తీసుకోవాలని జగన్ పేర్కొన్నారు. కుల గణనపై కమిటీ ప్రతినిధులు చేసిన డిమాండ్లు సమంజసమైనవని, వాటిని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
కుల గణన ప్రక్రియలో ఏ ఒక్క కులం కూడా మిగిలిపోకుండా సమగ్ర కులాల జాబితాను అందుబాటులో ఉంచాలని కమిటీ కోరినట్లు తెలిపారు. అలాగే ప్రతి కుటుంబ ఆర్థిక పరిస్థితిని తెలియజేసే వివరాలను కూడా గణనలో నమోదు చేయాలని డిమాండ్ చేసినట్లు వెల్లడించారు.
సమగ్ర కుల గణన చేపట్టాలనే డిమాండ్‌ను వైసీపీ మొదటి నుంచీ సమర్థిస్తోందని జగన్ గుర్తుచేశారు. కచ్చితమైన, సమగ్రమైన, అందరినీ భాగస్వాములను చేసే కుల గణన ద్వారానే వాస్తవ పరిస్థితులు వెలుగులోకి వస్తాయని పేర్కొన్నారు. ఆ గణాంకాల ఆధారంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలను మరింత సమర్థంగా అమలు చేయడంతోపాటు సామాజిక న్యాయానికి బాటలు వేయవచ్చని స్పష్టం చేశారు.
