హైదరాబాద్‌/న్యూఢిల్లీ, నవంబర్‌ 19: దేశవ్యాప్తంగా పెండ్లిళ్ల సీజన్‌ సందడి మొదలుకానుంది. ఈ నెల 21 నుంచి డిసెంబర్‌ 15 వరకు కొనసాగే 25 రోజుల వివాహ సీజన్‌లో దేశవ్యాప్తంగా సుమారు 52 లక్షల పెండ్లిళ్లు జరిగే అవకాశం ఉందని అఖిల భారత వర్తకుల సమాఖ్య (సీఏఐటీ) అంచనా వేసింది. ఈ పెండ్లిళ్ల ద్వారా దాదాపు రూ.7.5 లక్షల కోట్ల వ్యాపారం జరిగే అవకాశం ఉందని వెల్లడించింది. రోజుకు సగటున రెండు లక్షలకు పైగా వివాహాలు జరగవచ్చని పేర్కొంది.

పెండ్లిళ్ల సీజన్‌తో రిటైల్‌, తయారీ, ఆతిథ్యం, రవాణా, ఆహారం, నగలు తదితర రంగాలకు భారీగా డిమాండ్‌ పెరగనుందని సీఏఐటీ తెలిపింది. ఒక్క ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ ప్రాంతంలోనే సుమారు రూ.2.5 లక్షల కోట్ల వ్యాపారం నమోదవుతుందని అంచనా వేసింది. దేశంలోని 25 రాష్ట్రాలకు చెందిన 300 మందికి పైగా వర్తక నేతలు, 550 వర్తక సంఘాలతో సంప్రదింపులు జరిపిన అనంతరం సీఏఐటీ రిసెర్చ్‌ అండ్‌ ట్రేడ్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ ఈ అంచనాలను రూపొందించింది.

మొత్తం వ్యాపారంలో వస్తువులు, రిటైల్‌ కొనుగోళ్ల వాటా 54 శాతంగా, అంటే రూ.4.05 లక్షల కోట్లుగా ఉండనుంది. మిగిలిన 46 శాతం, అంటే రూ.3.45 లక్షల కోట్ల వ్యాపారం సేవల రంగం ద్వారా జరగవచ్చని అంచనా వేసింది.

ఏ రంగంలో ఎంత వ్యాపారం?

పెండ్లిళ్ల సీజన్‌లో వివిధ రంగాల్లో భారీగా కొనుగోళ్లు జరిగే అవకాశం ఉంది.

  • నగలు, విలువైన లోహాలు: రూ.1.2 లక్షల కోట్లు
  • దుస్తులు, గార్మెంట్స్‌: రూ.90 వేల కోట్లు
  • బహుమతులు, పెండ్లి సామగ్రి: రూ.37,500 కోట్లు
  • నిత్యావసరాలు, ఆహార సరఫరాలు: రూ.37,500 కోట్లు
  • ఎలక్ట్రానిక్స్‌: రూ.30 వేల కోట్లు
  • డ్రై ఫ్రూట్స్‌, స్వీట్లు: రూ.30 వేల కోట్లు
  • ఫర్నిచర్‌, గృహోపకరణాలు: రూ.30 వేల కోట్లు

తెలంగాణలోనూ పెండ్లి ముహూర్తాల సందడి

తెలంగాణలోనూ నవంబర్‌ 20న దేవుత్తాన ఏకాదశితో చాతుర్మాసం ముగిసిన అనంతరం వివాహ ముహూర్తాలు ప్రారంభం కానున్నాయి. నవంబర్‌ 21, 24, 25, 26 తేదీలతో పాటు డిసెంబర్‌ 2, 3, 4, 5, 6, 11, 12 తేదీల్లో మంచి ముహూర్తాలు ఉన్నట్లు సమాచారం. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పెండ్లిళ్ల సందడి నెలకొననుంది.

అయితే ధనుర్మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో డిసెంబర్‌ 16 నుంచి వచ్చే ఏడాది జనవరి 14 వరకు వివాహాలకు విరామం ఉండనుంది. దీంతో డిసెంబర్‌ 15లోపు పెండ్లిళ్లు చేసుకునేందుకు పలువురు సిద్ధమవుతున్నారు.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *