న్యూఢిల్లీ, నవంబర్‌ 19: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) పీఎఫ్‌ ఖాతాదారులకు కీలక వెసులుబాట్లు కల్పించింది. పదవీ విరమణ తర్వాత పీఎఫ్‌ మొత్తాన్ని ఒకేసారి ఉపసంహరించుకోకుండా, అవసరానికి అనుగుణంగా విడతల వారీగా తీసుకునేలా సిస్టమాటిక్‌ విత్‌డ్రాయల్‌ ప్లాన్‌ (ఎస్‌డబ్ల్యూపీ)కు ఆమోదం తెలిపింది. ఈ విధానం పూర్తిగా ఖాతాదారుల ఇష్టంపై ఆధారపడి ఉంటుంది. ఖాతాలోని అసలు మొత్తాన్ని అలాగే ఉంచి, దానిపై వచ్చే వడ్డీని మాత్రమే ఉపసంహరించుకునే వెసులుబాటు కూడా కల్పించింది.

కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్‌ మాండవీయ అధ్యక్షతన గురువారం జరిగిన కేంద్ర ట్రస్టీల బోర్డు (సీబీటీ) 240వ సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు.

కొత్త విధానం ప్రకారం పీఎఫ్‌ సభ్యులు తమ పొదుపు మొత్తాన్ని నెలవారీ, మూడు నెలలకు ఒకసారి లేదా ఆరు నెలలకు ఒకసారి వాయిదాల రూపంలో పొందవచ్చు. ఉపసంహరణ తర్వాత ఖాతాలో మిగిలిన మొత్తంపై వడ్డీ, రాబడులు కొనసాగుతాయి. తద్వారా పదవీ విరమణ అనంతరం కూడా క్రమం తప్పకుండా ఆదాయం పొందే అవకాశం ఉంటుంది.

వాయిదాల చెల్లింపులు కొనసాగుతున్న సమయంలో ఖాతాదారుడు మరణిస్తే, నామినీలు లేదా ఆధారపడిన కుటుంబ సభ్యులు ఖాతాలో మిగిలిన మొత్తాన్ని ఒకేసారి తీసుకోవచ్చు. లేదా నిర్ణీత వ్యవధిలో చెల్లింపులను కొనసాగించుకునే అవకాశం ఉంటుంది. మరోవైపు, ఉద్యోగుల డిపాజిట్‌ లింక్డ్‌ ఇన్సూరెన్స్‌ పథకం-2026లో సవరణలకు కూడా సీబీటీ ఆమోదం తెలిపింది.

పీఎఫ్‌ నిల్వలో 90 శాతం వరకు ఉపసంహరణకు అవకాశం

మరో కీలక నిర్ణయంలో భాగంగా పీఎఫ్‌ ఉపసంహరణ నిబంధనలను ఈపీఎఫ్‌వో సడలించింది. నిర్దిష్ట అర్హతలు, షరతులకు లోబడి 55 ఏళ్లలోపు ఉన్న సభ్యులు తమ పీఎఫ్‌ పొదుపులో 90 శాతం వరకు ఉపసంహరించుకునే వెసులుబాటు కల్పించింది. అయితే పదవీ విరమణ సమయానికి కొంత మొత్తం పొదుపుగా మిగిలి ఉండేలా ఈ నిబంధనలను రూపొందించినట్లు మనీకంట్రోల్‌ కథనం వెల్లడించింది.

అలాగే ఉద్యోగం కోల్పోయిన తర్వాత పీఎఫ్‌ నగదును ఉపసంహరించుకునేందుకు వేచి ఉండాల్సిన గడువును 12 నెలల నుంచి రెండు నెలలకు తగ్గించినట్లు తెలిపింది. 2026 పీఎఫ్‌ పథకంలోని సవరించిన నిబంధనల ప్రకారం ఈ మార్పులు చేసినట్లు పేర్కొంది.

అయితే ప్రతి సభ్యుడూ ఎలాంటి కారణం లేకుండా తమ పీఎఫ్‌ నిల్వలో 90 శాతం వరకు తీసుకోవచ్చని దీని అర్థం కాదని కథనం స్పష్టం చేసింది. సభ్యుడి అర్హత, ఉపసంహరణకు గల కారణం, పథకంలో నిర్దేశించిన పరిమితుల ఆధారంగానే అందుబాటులో ఉండే మొత్తం నిర్ణయిస్తారు. ఉద్యోగుల పదవీ విరమణ పొదుపు ముందుగానే పూర్తిగా ఖర్చుకాకుండా చూడటమే ఈ మార్పుల ప్రధాన ఉద్దేశం.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *