
ప్రతి నెలలో పౌర్ణమి ఏ నక్షత్రంలో వస్తుందో ఆ నక్షత్రం ఆధారంగానే మన పూర్వీకులు మాసాలకు పేర్లు నిర్ణయించారు. కృత్తికా నక్షత్రంలో పౌర్ణమి వచ్చే మాసాన్ని కార్తిక మాసంగా పిలుస్తారు. ఈ మాసానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. ఏడాది పొడవునా వివిధ మాసాల్లో దీపారాధన చేసినప్పటికీ కార్తిక మాసంలో వెలిగించే దీపానికి మాత్రమే ‘కార్తిక దీపం’ అనే విశిష్టమైన పేరు ఉంది. ఈ మాసంలో దీపం వెలిగించడం అనంతమైన పుణ్యఫలాన్ని ఇస్తుందని పురాణాలు పెద్దలు చెబుతారు.
కృత్తికా నక్షత్రం అగ్నిదేవుడికి ప్రతీకగా భావిస్తారు. కార్తిక మాసంలో వాతావరణం చల్లగా మారి సూర్యుడి తేజస్సు తగ్గుతుంది. చలి తీవ్రత పెరిగే ఈ సమయంలో అగ్నిని దీప రూపంలో ఆరాధించడం విశేషమని ఆధ్యాత్మిక గ్రంథాలు వివరిస్తాయి. దీపం కేవలం వెలుగుకు మాత్రమే కాదు జ్ఞానానికి కూడా ప్రతీక. మనలోని అజ్ఞానం, అవిద్య అనే చీకట్లను తొలగించి జ్ఞానజ్యోతిని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తూ దీపారాధన చేస్తారు. దీపాన్ని పరమేశ్వర స్వరూపంగా భావించి పూజిస్తారు.
నిత్య దీపారాధనతో శుభఫలాలు
కార్తిక మాసంలోనే కాకుండా ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం సంధ్యా సమయాల్లో దీపారాధన చేయాలని శాస్త్రాలు సూచిస్తున్నాయి. దీపావళి అమావాస్య నుంచి ప్రారంభించి కార్తిక మాసమంతా దీపాలు వెలిగించడం సంప్రదాయంగా వస్తోంది. ముఖ్యంగా కార్తిక పౌర్ణమి రోజున దీపాలు వెలిగించడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు.
ఇంట్లో నిత్యం దీపం వెలిగించడం శుభసూచకమని పెద్దలు చెబుతారు. అయితే రోజూ దీపారాధన చేయడం సాధ్యపడని సందర్భాల్లో తెలియక ఏవైనా పొరపాట్లు జరిగినప్పుడు వాటికి ప్రాయశ్చిత్తంగా కార్తిక పౌర్ణమి నాడు 365 వత్తులతో కూడిన గుత్తి దీపాన్ని ఆవు నెయ్యితో వెలిగిస్తారు. ఏడాదిలోని 365 రోజులకు ప్రతీకగా ఈ దీపాన్ని వెలిగించే సంప్రదాయం ఉంది.
కార్తిక పౌర్ణమి స్నానం, జపం, ధ్యానానికి ప్రత్యేకత
కార్తిక పౌర్ణమి రోజున చేసే స్నానం, జపం, ధ్యానం విశేషమైన ఫలితాలను అందిస్తాయని భక్తుల విశ్వాసం. ఈ పవిత్రమైన రోజున దీపాలు వెలిగించి తమ పాపాలు తొలగిపోవాలని ప్రపంచమంతా సుఖసంతోషాలు, శాంతి, సౌభాగ్యాలతో వర్ధిల్లాలని భగవంతుడిని ప్రార్థిస్తారు.
శివాలయాల్లో జ్వాలాతోరణం వేడుక
కార్తిక పౌర్ణమి సందర్భంగా శివాలయాల్లో జ్వాలాతోరణం ఉత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తారు. ఈ సంప్రదాయం వెనుక పురాణాల్లో రెండు కథలు ప్రచారంలో ఉన్నాయి. క్షీరసాగర మథనం సమయంలో వెలువడిన హాలాహలాన్ని శివుడు స్వీకరించినప్పుడు ఆయనకు ఎలాంటి ఆపద కలగకూడదని పార్వతీదేవి ప్రార్థించిందని ఒక కథ చెబుతుంది.
తన భర్త క్షేమం కోసం జ్వాలాతోరణం కింద నుంచి ఆయనతో కలిసి ప్రదక్షిణ చేస్తానని మొక్కుకుని ఆ మొక్కును నెరవేర్చుకున్నట్లు పురాణగాథలు వివరిస్తాయి. మరో కథనం ప్రకారం త్రిపురాసురులను సంహరించి విజయంతో తిరిగి వచ్చిన పరమశివుడికి పార్వతీదేవి జ్వాలాతోరణంతో స్వాగతం పలికింది. ఈ రెండు కథనాల నేపథ్యంలో జ్వాలాతోరణం వేడుకకు శైవ సంప్రదాయంలో ప్రత్యేక స్థానం ఏర్పడింది.
కాశీలో దేవ దీపావళి అరుణాచలంలో కార్తిక దీపోత్సవం
కార్తిక పౌర్ణమి వేడుకలను దేశవ్యాప్తంగా భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఉత్తరప్రదేశ్లోని కాశీ క్షేత్రంలో ఈ పర్వదినాన్ని ‘దేవ దీపావళి’గా అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. గంగానది ఘాట్లన్నీ దీపకాంతులతో వెలిగిపోతాయి. తమిళనాడులోని అరుణాచల క్షేత్రంలో ‘కార్తిక దీపోత్సవం’ అంగరంగ వైభవంగా జరుగుతుంది.
కొండపై మహాదీపాన్ని వెలిగించడం ఈ వేడుకలో ప్రధాన ఘట్టం. ఇలా కార్తిక మాసం దీపారాధన, శివారాధన, ఆధ్యాత్మిక సాధనలకు ప్రత్యేకమైన సమయంగా భక్తుల విశ్వాసంలో విశిష్ట స్థానాన్ని సంపాదించుకుంది.
