ఆధార్ కార్డును ఒక వ్యక్తి పుట్టిన తేదీకి తుది ప్రామాణిక ఆధారంగా పరిగణించలేమని ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఆధార్ కార్డు కేవలం వ్యక్తి గుర్తింపును ధ్రువీకరించే పత్రం మాత్రమేనని, అది జనన తేదీకి అధికారిక రుజువు కాదని స్పష్టం చేసింది.

ఉద్యోగి పదవీ విరమణ వయస్సుకు సంబంధించిన వివాదంపై విచారణ జరిపిన న్యాయస్థానం.. ఆధార్ కార్డులోని వివరాల కంటే ఈఎస్ఐసీ (ESIC) రికార్డుల్లో నమోదైన పుట్టిన తేదీకే ప్రాధాన్యతనిచ్చింది. ఈ విషయంలో యాజమాన్యం దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ ఉద్యోగినికి అనుకూలంగా తీర్పునిచ్చింది.

ఈ తీర్పుతో ఆధార్ కార్డును పుట్టిన తేదీకి అంతిమ ఆధారంగా పరిగణించలేమన్న విషయాన్ని ఢిల్లీ హైకోర్టు మరోసారి స్పష్టం చేసింది.

ప్రస్తుతం ఆధార్ కార్డు ప్రతి ఒక్కరికీ అత్యంత కీలకమైన గుర్తింపు పత్రంగా మారింది. దాదాపు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ అవసరాలకు దీనిని ఉపయోగిస్తున్నారు. అయితే ఆధార్ కార్డులో నమోదైన వివరాలన్నింటినీ ప్రామాణికమైనవిగా పరిగణించలేమని ఢిల్లీ హైకోర్టు మరోసారి స్పష్టం చేసింది.

ముఖ్యంగా ఒక వ్యక్తి పుట్టిన తేదీని నిర్ధారించేందుకు ఆధార్ కార్డును అంతిమ ఆధారంగా తీసుకోలేమని కీలక తీర్పు వెలువరించింది. ఆధార్ చట్టంలోని నిబంధనలను ప్రస్తావించిన జస్టిస్ మనోజ్ కుమార్ ఓహ్రి నేతృత్వంలోని ధర్మాసనం.. ఆధార్ సంఖ్య కేవలం వ్యక్తి గుర్తింపును ధ్రువీకరించే పత్రం మాత్రమేనని పేర్కొంది. అది జనన ధ్రువీకరణ పత్రానికి ప్రత్యామ్నాయం కాదని స్పష్టం చేసింది.

జేజే ఎలక్ట్రానిక్స్’ సంస్థలో పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగిని వయసుకు సంబంధించి వివాదం తలెత్తడంతో యాజమాన్యం 2017లో ఆమెను ఉద్యోగం నుంచి తొలగించింది. ఆమె ఆధార్ కార్డులో పుట్టిన తేదీ 1959 మే 20గా నమోదై ఉందని, ఆ లెక్కన పదవీ విరమణ వయసైన 58 ఏళ్లు పూర్తయ్యాయని సంస్థ యాజమాన్యం వాదించింది.

అయితే ఆధార్ కార్డులో నమోదైన పుట్టిన తేదీ తప్పని, ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC) రికార్డుల ప్రకారం తన జన్మదినం 1960 మే 20 అని ఆ మహిళ పేర్కొన్నారు. తనను అక్రమంగా ఉద్యోగం నుంచి తొలగించారంటూ కార్మిక న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన లేబర్ కోర్టు ఉద్యోగినికి అనుకూలంగా తీర్పునిస్తూ, ఆమె తొలగింపు చట్టవిరుద్ధమని ప్రకటించింది.

లేబర్ కోర్టు తీర్పును సవాలు చేస్తూ జేజే ఎలక్ట్రానిక్స్ యాజమాన్యం ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ మనోజ్ కుమార్ ఓహ్రి యాజమాన్యం వాదనలను తోసిపుచ్చారు.

ఈ సందర్భంగా 2018లో భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) జారీ చేసిన ఆఫీస్ మెమొరాండంను ధర్మాసనం ప్రస్తావించింది. ఆధార్ కార్డులో పుట్టిన తేదీని కార్డుదారుడు సమర్పించిన పత్రాలు లేదా స్వీయ ప్రకటన ఆధారంగా మాత్రమే నమోదు చేస్తారని యూఐడీఏఐ గతంలోనే స్పష్టం చేసిన విషయాన్ని న్యాయస్థానం గుర్తుచేసింది..

ఈ నేపథ్యంలో ఆధార్ కార్డులో నమోదైన పుట్టిన తేదీని అంతిమ సాక్ష్యంగా పరిగణించలేమని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఈఎస్ఐసీ రికార్డుల ప్రకారం సదరు మహిళ 1960లో జన్మించారని, అందువల్ల 2017 నాటికి ఆమెకు పదవీ విరమణ వయసు పూర్తికాలేదని న్యాయస్థానం అంగీకరించింది.

ఆధార్ కార్డులో నమోదైన భిన్నమైన తేదీని కారణంగా చూపుతూ, మహిళా ఉద్యోగిని ఏడాది ముందుగానే విధుల నుంచి తొలగించే హక్కు యాజమాన్యానికి లేదని తేల్చి చెప్పింది. అంతేకాకుండా, పారిశ్రామిక వివాదాల చట్టంలోని నిబంధనలను సంస్థ యాజమాన్యం పాటించలేదని పేర్కొంది.

ఈ క్రమంలో కార్మిక న్యాయస్థానం ఇచ్చిన తీర్పును సమర్థించిన ఢిల్లీ హైకోర్టు.. జేజే ఎలక్ట్రానిక్స్ యాజమాన్యం దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో సదరు మహిళా ఉద్యోగినికి న్యాయం జరిగినట్లయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *