
హైదరాబాద్‌లోని మాదాపూర్ హైటెక్స్ ప్రాంతంలో సైబరాబాద్ నగరపాలక సంస్థ (CMC) కోసం అత్యాధునిక ట్విన్ టవర్ల తరహా ప్రధాన కార్యాలయాన్ని నిర్మించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ భారీ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం రూ.169 కోట్లను కేటాయించింది. స్టిల్ట్ ప్లస్ ఎనిమిది అంతస్తులతో, మొత్తం 2.41 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవనాన్ని నిర్మించనున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే టెండర్లను ఆహ్వానించారు.
ఒప్పందం ఖరారైన 12 నెలల్లోగా నిర్మాణ పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఈ కొత్త కార్యాలయంలో ప్రజావాణి కేంద్రం, కౌన్సిల్ హాల్, కమాండ్ కంట్రోల్ సెంటర్, ఆడిటోరియంతో పాటు నగరపాలక సంస్థకు చెందిన అన్ని ప్రధాన విభాగాలకు ప్రత్యేక కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నారు. ఆధునిక సదుపాయాలతో నిర్మించనున్న ఈ భవనం సైబరాబాద్ పరిపాలనకు కీలక కేంద్రంగా మారనుంది.
హైదరాబాద్‌లో మరో ప్రతిష్ఠాత్మక ప్రభుత్వ భవన నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. సైబరాబాద్ నగరపాలక సంస్థ (CMC) కోసం అత్యాధునిక హంగులతో ట్విన్ టవర్ల తరహాలో కొత్త ప్రధాన కార్యాలయాన్ని నిర్మించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. మాదాపూర్‌లోని హైటెక్స్ ప్రాంతంలో 4.11 ఎకరాల స్థలంలో ఈ భారీ భవన సముదాయాన్ని ఏర్పాటు చేయనున్నారు.
ఈ ప్రాజెక్టు కోసం సీఎంసీ ఇంజినీరింగ్ విభాగం టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. నిర్మాణానికి మొత్తం రూ.169 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేయగా.. పన్నులు మినహాయించి రూ.125.79 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్ణయించారు. స్పెషల్ క్లాస్ కాంట్రాక్టు సంస్థలు టెండర్లలో పాల్గొనేందుకు అర్హత కల్పించారు. ఒప్పందం కుదిరిన తేదీ నుంచి 12 నెలల్లోగా నిర్మాణ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు.
సుమారు 2.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో స్టిల్ట్ ప్లస్ ఎనిమిది అంతస్తులతో ఈ భవనాన్ని నిర్మించనున్నారు. ప్రస్తుతం సీఎంసీ కార్యాలయం హైటెక్స్ సమీపంలోని న్యాక్ భవనంలో తాత్కాలికంగా కొనసాగుతోంది. కొత్త కార్యాలయం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఐటీ కంపెనీ క్యాంపస్‌ను తలపించేలా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులకు సూచించారు.
ఈ నేపథ్యంలో కమిషనర్ జి.సృజన ఆధ్వర్యంలో పలు భవన నమూనాలను పరిశీలించిన అధికారులు చివరకు ట్విన్ టవర్ల డిజైన్‌ను ఖరారు చేశారు. నిర్మాణం పూర్తయితే సైబరాబాద్ నగరపాలక సంస్థకు అత్యాధునిక సౌకర్యాలతో కూడిన శాశ్వత ప్రధాన కార్యాలయం అందుబాటులోకి రానుంది.
హైటెక్స్, నోవాటెల్ మధ్య ఖానామెట్ ప్రాంతంలో ఈ ట్విన్ టవర్స్ భవనాన్ని నిర్మించనున్నారు. భవనం వెనుకవైపు చెరువు ఉండేలా ప్రణాళిక రూపొందించారు. రెండు టవర్లలో ఒకటి ఆరు అంతస్తులు, మరొకటి ఎనిమిది అంతస్తులతో రూపుదిద్దుకోనున్నాయి. భవనం వెలుపలి భాగంలో ముదురు కాఫీ రంగు అద్దాలను ఏర్పాటు చేయనున్నారు. ప్రతి అంతస్తులో సహజమైన గాలి, వెలుతురు అన్ని వైపుల నుంచి అందేలా ప్రత్యేక నిర్మాణ నమూనాను రూపొందించారు.
ప్రజలకు అవసరమైన సేవలు, ప్రజాప్రతినిధుల సమావేశాలు ఒకే ప్రాంగణంలో జరిగేలా అంతర్గత విభాగాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా మొదటి అంతస్తును పూర్తిగా ప్రజల అవసరాలకు కేటాయించారు. 195 మంది కూర్చునే సామర్థ్యంతో కౌన్సిల్ హాల్, ప్రజావాణి కేంద్రం, వీఐపీ గది, డైనింగ్ హాల్, మీడియా గదిని ఏర్పాటు చేయనున్నారు.
రెండో అంతస్తులో మేయర్, డిప్యూటీ మేయర్, కమిషనర్ కార్యాలయాలతో పాటు స్థాయీ సంఘం సమావేశ మందిరం, ఫ్లోర్ లీడర్ల క్యాబిన్లు, సెక్రటరీ కార్యాలయం అందుబాటులో ఉంటాయి.
మూడో అంతస్తులో పరిపాలన, ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన విభాగాలు కొలువుదీరనున్నాయి. అదనపు కమిషనర్ల కార్యాలయాలతో పాటు జనరల్ బ్రాంచి, కార్మిక సంక్షేమం, విజిలెన్స్ విభాగాలకు ఇక్కడ స్థలం కేటాయించారు.
నాలుగో అంతస్తులో క్రీడలు, హైడ్రా, విద్యుత్తు, జలమండలి, పారిశుద్ధ్య విభాగాలకు సంబంధించిన కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నారు. ఐదో అంతస్తును ప్రధానంగా ఇంజినీరింగ్, టౌన్ ప్లానింగ్, భూసేకరణ విభాగాలకు కేటాయించారు.
ఆరో అంతస్తులో రెవెన్యూ, ఎన్నికలు, ఎస్టేట్స్, ఐటీ, ప్రకటనలు, జీఐఎస్, న్యాయ విభాగాలతో పాటు పట్టణ పేదరిక నిర్మూలన, పట్టణ జీవనోపాధి విభాగాల కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నారు. వీటితోపాటు మరికొన్ని ఇంజినీరింగ్ విభాగాలకు కూడా ఇక్కడ ప్రత్యేక స్థలం కల్పించనున్నారు. ఇలా సీఎంసీకి సంబంధించిన కీలక విభాగాలన్నీ ఒకే భవన సముదాయంలో పనిచేసేలా కార్యాలయాన్ని తీర్చిదిద్దుతున్నారు.
కొత్త భవనంలోని ఏడో అంతస్తులో 1,311 చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునిక కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నారు. కమిషనర్‌తో పాటు ఇతర ఉన్నతాధికారుల కోసం ప్రత్యేక కార్యాలయ గదులు కూడా నిర్మించనున్నారు. భవన విద్యుత్ అవసరాల్లో కొంత భాగాన్ని సొంతంగా తీర్చుకునేలా సౌర విద్యుత్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానున్నారు.
ఎనిమిదో అంతస్తులో 400 మంది ఒకేసారి కూర్చునే సామర్థ్యంతో 3,270 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆధునిక ఆడిటోరియాన్ని నిర్మించనున్నారు. ఇక స్టిల్ట్ ప్రాంతంలో ప్రధాన ప్రవేశ ద్వారాలతో పాటు మీ సేవా, పౌరసేవా కేంద్రాలు, వాహనాల పార్కింగ్, పార్కు, మురుగునీటి శుద్ధి కేంద్రం, శౌచాలయాలు ఏర్పాటు చేయనున్నారు.
మొత్తం 16,668 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించనున్న ఈ ట్విన్ టవర్స్ కార్యాలయం అందుబాటులోకి వస్తే సైబరాబాద్ నగరపాలక సంస్థకు శాశ్వత పరిపాలనా కేంద్రం ఏర్పడనుంది. అంతేకాకుండా ప్రజలకు అవసరమైన వివిధ పౌరసేవలు ఒకే చోట అందుబాటులోకి రానున్నాయి. ఆధునిక సాంకేతిక సదుపాయాలతో రూపుదిద్దుకోనున్న ఈ భవనం సైబరాబాద్ పాలనలో కీలక పాత్ర పోషించనుంది.
