కాకినాడ జెడ్పీ ఛైర్‌పర్సన్‌ పదవిపై ఆశలు పెట్టుకున్న కాకినాడ రూరల్‌ టీడీపీ ఇన్‌ఛార్జి పిల్లి అనంతలక్ష్మికి నిరాశ ఎదురైంది. పొత్తులో భాగంగా ఈ పదవిని జనసేనకు కేటాయించడంతో ఆమెకు వైస్‌ ఛైర్‌పర్సన్‌ పదవి ఇచ్చారు. దీంతో అసంతృప్తికి గురైన అనంతలక్ష్మి జెడ్పీ ఛైర్‌పర్సన్‌ ఎన్నిక కార్యక్రమానికి హాజరుకావడానికి నిరాకరించారు.

ఈ విషయం తెలుసుకున్న టీడీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్‌, ఎంపీ సానా సతీశ్‌ తదితరులు ఆమె వద్దకు వెళ్లి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. వారి విజ్ఞప్తితో జెడ్పీ సమావేశ మందిరానికి చేరుకున్న అనంతలక్ష్మి.. చివరకు వైస్‌ ఛైర్‌పర్సన్‌గా ప్రమాణస్వీకారం చేయకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో కాకినాడ జిల్లా రాజకీయాల్లో ఈ పరిణామం చర్చనీయాంశంగా మారింది.

ఆంధ్రప్రదేశ్‌లో జిల్లా పరిషత్‌లకు కొత్త పాలకమండళ్లు కొలువుదీరాయి. రాష్ట్రవ్యాప్తంగా నూతనంగా ఎన్నికైన జెడ్పీటీసీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేయగా.. జెడ్పీ ఛైర్‌పర్సన్‌, వైస్‌ ఛైర్‌పర్సన్‌ ఎన్నికల ప్రక్రియ కూడా పూర్తయింది.

రాష్ట్రంలోని మొత్తం 28 జెడ్పీ ఛైర్‌పర్సన్‌, వైస్‌ ఛైర్‌పర్సన్‌ పదవులకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 27 చోట్ల విజయం సాధించింది. ఇందులో టీడీపీ అత్యధికంగా 22 జెడ్పీ ఛైర్‌పర్సన్‌, 20 వైస్‌ ఛైర్‌పర్సన్‌ పదవులను దక్కించుకుంది. జనసేనకు నాలుగు ఛైర్‌పర్సన్‌, ఐదు వైస్‌ ఛైర్‌పర్సన్‌ స్థానాలు లభించాయి. బీజేపీ ఒక ఛైర్‌పర్సన్‌, రెండు వైస్‌ ఛైర్‌పర్సన్‌ పదవులను కైవసం చేసుకుంది.

మరోవైపు అల్లూరి సీతారామరాజు జిల్లా పరిషత్‌లో మాత్రం వైఎస్సార్‌సీపీకి ఛైర్‌పర్సన్‌, వైస్‌ ఛైర్‌పర్సన్‌ పదవులు దక్కాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కొత్త జెడ్పీ పాలకమండళ్ల ఏర్పాటు ప్రక్రియ పూర్తయింది.

ఇదిలా ఉండగా, కాకినాడ జిల్లా పరిషత్‌ పదవుల కేటాయింపు టీడీపీలో అసంతృప్తికి దారితీసింది. టీడీపీ సీనియర్‌ నాయకురాలు, కాకినాడ రూరల్‌ మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత జెడ్పీటీసీ సభ్యురాలు పిల్లి అనంతలక్ష్మి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కాకినాడ జెడ్పీ ఛైర్‌పర్సన్‌ పదవిపై ఆశలు పెట్టుకున్న ఆమెకు ఆ అవకాశం దక్కకపోవడంతో కనీసం జెడ్పీటీసీ సభ్యురాలిగా కూడా ప్రమాణ స్వీకారం చేయలేదు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన అనంతలక్ష్మి కొద్దిసేపు అక్కడే ఉండి అనంతరం బయటకు వెళ్లిపోయారు.

కాకినాడ జెడ్పీ ఛైర్‌పర్సన్‌ పదవి జనరల్‌ మహిళకు రిజర్వ్‌ కావడంతో తనకు అవకాశం లభిస్తుందని ఆమె భావించారు. బీసీ సామాజికవర్గానికి ఈ పదవి కేటాయించే అవకాశం ఉందన్న అంచనాలతో కాకినాడ రూరల్‌ జెడ్పీటీసీగా పోటీ చేసి విజయం సాధించారు. అయితే కూటమి పొత్తులో భాగంగా ఛైర్‌పర్సన్‌ పదవిని జనసేనకు కేటాయించడంతో ఆమె ఆశలు నెరవేరలేదు. ప్రత్యామ్నాయంగా వైస్‌ ఛైర్‌పర్సన్‌ పదవి ఇచ్చినా అనంతలక్ష్మి అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ పరిణామంపై సమాచారం అందుకున్న టీడీపీ ఎంపీ సానా సతీశ్‌, కాకినాడ జిల్లా పార్టీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్‌, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్‌ ఆమె ఇంటికి వెళ్లి బుజ్జగించే ప్రయత్నం చేశారు. వారి విజ్ఞప్తితో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వచ్చినప్పటికీ జెడ్పీటీసీగా ప్రమాణం చేయకుండానే తిరిగి వెళ్లిపోయారు.

పిల్లి అనంతలక్ష్మి గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి టీటీడీ పాలకమండలి సభ్యురాలిగా పనిచేశారు. ప్రస్తుతం కాకినాడ రూరల్‌ నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జిగా కొనసాగుతున్నారు. తనకు ఆశించిన పదవి దక్కకపోవడంపై ఆమె బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేయడం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *