
హైదరాబాద్‌లో రిటైల్ రంగానికి లభిస్తున్న ఆదరణతో మరో 15 కొత్త మాల్స్ ప్రారంభానికి సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం 30కి పైగా మాల్స్ ఉండగా.. కొత్తగా 6 గ్రేడ్-1, పలు గ్రేడ్-2 మాల్స్ జతకానున్నాయి. సంధ్య లులూ, ఫోరం మాల్, వంశీరామ్, బ్రూక్‌ఫీల్డ్ వంటి దిగ్గజ మాల్స్ రాబోతున్నాయి. కాగా, నిర్వహణ భారం, ఆధునిక పోటీ తట్టుకోలేక పాత మాల్స్ క్రమంగా ఆస్పత్రులు, కామర్షియల్ టవర్లుగా మారుతున్నాయి. మరోవైపు నగరంలోని అన్ని దిక్కులా మాల్స్ కల్చర్ విస్తరిస్తున్నట్లు అనరాక్ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
హైదరాబాద్ మహానగరంలో రిటైల్ రంగం శరవేగంగా విస్తరిస్తోంది. మాల్స్ సంస్కృతి నగరంలో కొత్త శిఖరాలకు చేరుకుంటోంది. తాజాగా అందిన వివరాల ప్రకారం.. ఈ సంవత్సరాంతానికి లేదా వచ్చే ఏడాది నాటికి గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా కొత్తగా మరో 15 మాల్స్ ప్రారంభం కానున్నాయని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే నగరంలో చిన్నవి, పెద్దవి కలిపి 30కి పైగా మాల్స్ అందుబాటులో ఉన్నాయి. దేశంలోనే అత్యంత వేగంగా విస్తరిస్తున్న నగరాల్లో హైదరాబాద్ ఒకటి అని అనరాక్ వంటి ప్రముఖ రియల్ ఎస్టేట్ పరిశోధనా సంస్థలు వెల్లడిస్తున్నాయి.
ఒకప్పుడు కేవలం సెంట్రల్ హైదరాబాద్ ప్రాంతానికే పరిమితమైన మాల్స్, ఇప్పుడు నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ అంటూ నగర నలుమూలలకూ విస్తరించాయి. కొత్తగా రాబోతున్న వాటిలో ఆరు మాల్స్ గ్రేడ్-1 కేటగిరీకి చెందినవిగా ఉండనున్నాయి. దీంతో నగరంలో గ్రేడ్-1 మాల్స్ సంఖ్య 9 నుంచి 15కి చేరనుంది. మరోవైపు.. కొత్తగా అత్యాధునిక మాల్స్ రూపుదిద్దుకుంటుండటంతో పాత మాల్స్ నిర్వహణ తీవ్ర భారంగా మారి తెరమరుగయ్యే పరిస్థితి నెలకొంది. కొన్ని పాత మాల్స్ ఇప్పటికే ఆస్పత్రులుగా, వాణిజ్య సముదాయాలుగా రూపాంతరం చెందుతుండగా.. మరికొన్ని మాల్స్ నిర్మాణ దశలోనే ఇతర వాణిజ్య సంస్థలుగా మారిపోతున్నాయి.
నగరంలో రాబోతున్న ప్రధాన గ్రేడ్-1 మాల్స్ చూసినట్లయితే.. నార్సింగి వద్ద దేశంలోనే అతిపెద్ద మాల్స్‌లో ఒకటిగా సంధ్య లులూ మాల్ రానుంది. రాజేంద్రనగర్‌లోని ప్రెస్టీజ్ సిటీలో దాదాపు 12 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఫోరం మాల్ నిర్మితమవుతోంది. గచ్చిబౌలి పరిసరాల్లో యూనిటీ మాల్, నార్సింగి వద్ద లగ్జరీ మాల్‌గా వంశీరామ్ మాల్, కోకాపేట వద్ద ఏరియా బై ఫెయిర్‌మౌంట్, కర్మాన్‌ఘాట్ వద్ద కొలీసియం మాల్ రూపుదిద్దుకుంటున్నాయి. వీటితో పాటు నానక్‌రామ్‌గూడ వద్ద ఎస్ఏఎస్ ఐ-టవర్స్ రిటైల్, రాయదుర్గంలో బ్రూక్‌ఫీల్డ్ కే రహేజా కార్ప్ మాల్, డౌన్ టౌన్ మాల్స్ అందుబాటులోకి రానున్నాయి.

