
ఆంధ్రప్రదేశ్‌లో చేనేతలకు ప్రభుత్వం అండగా నిలిచింది. వారి కోసం ‘నేతన్న సేవలో’ పథకం అమలు చేస్తోంది.. ఒక్కో కుటుంబానికి రూ.25 వేలు అందజేయనుంది. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా బాపట్ల జిల్లా చీరాలలో నిధులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నిధుల్ని విడుదల చేయనున్నారు. మొత్తం రూ.179 కోట్లతో 71,536 చేనేత కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వం చెబుతోంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో పథకాన్ని అమలు చేస్తోంది.. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇవాళ చేనేత కార్మికుల కుటుంబాలకు ‘నేతన్న సేవలో’ పథకం ప్రారంభంకానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు బాపట్ల జిల్లా వేటపాలెం మండలం కొత్తపేటలో ఈ పథకాన్ని ప్రారంభించి ఒక్కొక్కరికి రూ.25వేల చొప్పున ఆర్థిక సాయం విడుదల చేయనున్నారు. కుటుంబాన్ని ప్రాతిపదికగా తీసుకుని వయసు, మగ్గాల సంఖ్యతో సంబంధం లేకుండా సొంత మగ్గం ఉన్న చేనేత కార్మికులకు ఈ సాయం అందిస్తున్నారు. రాష్ట్రంలో 71,536 మంది నేత కార్మికుల కుటుంబాల ఖాతాల్లో రూ.179 కోట్లు బ్యాంకు అకౌంట్‌లలో జమ చేస్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ అమరావతిలోని క్యాంపు కార్యాలయం నుంచి బయల్దేరి 11:05 గంటలకు బాపట్ల జిల్లా చీరాలకు చేరుకుంటారు. జాండ్రపేటలో చేనేతల వర్క్‌షాపులో లబ్ధిదారులతో మాట్లాడతారు.. అనంతరం కొత్తపేటలో టీడీపీ నేతలు, కార్యకర్తలతో సమీక్షలో పాల్గొంటారు.
ఏపీ ప్రభుత్వం ఇప్పటికే చేనేత కార్మికుల కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తోంది. చేనేతలపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. చేనేతలకు నెలకు 200 యూనిట్లు, పవర్‌లూమ్‌లకు 500 యూనిట్ల వరకు ఉచిత్ విద్యుత్ అందిస్తున్నారు.. దీని కోసం ఏడాదికి రూ.150 కోట్లు ఖర్చవుతోంది. ఉచిత విద్యుత్ పథకంలో 62,541 చేనేత కుటుంబాలు, 10,032 పవర్‌లూమ్ కుటుంబాలకు మేలు జరుగుతోంది. క్యాష్ క్రెడిట్ ద్వారా ప్రాథమిక చేనేత సహకార సంఘాలకు రూ.79 కోట్లు అందించారు.
అంతేకాదు మంగళగిరిలో చేనేత పార్కు, రాష్ట్ర రాజధాని అమరావతిలోని శాఖమూరులో చేనేత, హస్తకళల మ్యూజియాన్ని, హ్యాండ్లూమ్ పార్కులు, టెక్స్‌టైల్ రీసైక్లింగ్ యూనిట్ వంటివి ఏర్పాటు చేస్తున్నారు. విశాఖపట్నంలో రూ.4,200 కోట్ల పెట్టుబడితో సుస్థిర టెక్స్‌టైల్ రీసైక్లింగ్ యూనిట్ ఏర్పాటవుతోంది. ఏపీ ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన చేనేత కార్మికుల్లో 50 ఏళ్లు దాటిన 85వేల మంది నేతన్నలకు నెలకు రూ.4వేల చొప్పున పింఛన్ అందిస్తోంది. మొత్తం మీద ఏపీ ప్రభుత్వం చేనేతల కోసం ఒక్కొక్కరికి రూ.25వేలు చొప్పున ఆర్థికసాయం అందిస్తోంది.

