ఏడాది పొడవునా సులభంగా లభించే పండ్లలో బొప్పాయి ఒకటి. బరువు తగ్గాలని ప్రయత్నించేవారు, మలబద్ధకంతో ఇబ్బంది పడేవారు దీనిని తరచుగా ఆహారంలో చేర్చుకుంటారు. పోషకాలు, ఫైబర్ సమృద్ధిగా ఉండటంతో బొప్పాయికి ఆరోగ్యకరమైన పండుగా మంచి గుర్తింపు ఉంది. అయితే ఏ ఆహారమైనా అతిగా తీసుకోవడం వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు బొప్పాయిని తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మరి బొప్పాయి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటి? ఎవరెవరు దీనికి దూరంగా ఉండాలి? తెలుసుకుందాం..

బొప్పాయిలో పాపైన్ అనే జీర్ణ ఎంజైమ్ ఉంటుంది. ఇది ఆహారంలోని ప్రోటీన్లను విచ్ఛిన్నం చేయడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే ఫైబర్ ప్రేగుల కదలికలను మెరుగుపరచడంతో పాటు మలవిసర్జన సాఫీగా జరిగేలా తోడ్పడుతుంది. అందువల్ల అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యల్లో బొప్పాయి ఉపశమనాన్ని అందించవచ్చు.
బొప్పాయి జీర్ణ ఆరోగ్యానికే కాకుండా రోగనిరోధక శక్తి, గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఇందులోని విటమిన్ C, విటమిన్ A శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. పొటాషియం రక్తపోటు నియంత్రణకు తోడ్పడగా, బీటా కెరోటిన్ కంటి ఆరోగ్యానికి ఉపయోగకరంగా ఉంటుంది. తక్కువ కేలరీల పండుగా ఉండటంతో బరువు నియంత్రణలో భాగంగా కూడా దీనిని తీసుకోవచ్చు.
అయితే బొప్పాయిని ప్రతిరోజూ అధిక మోతాదులో తీసుకోవడం మంచిది కాదు. ఎక్కువగా తింటే కొందరిలో కడుపు నొప్పి, గ్యాస్, విరేచనాలు వంటి జీర్ణ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా పచ్చి లేదా అరకొర పండిన బొప్పాయిలో లేటెక్స్ అధికంగా ఉండే అవకాశం ఉన్నందున గర్భిణీలు జాగ్రత్తగా ఉండాలి. పాపైన్, లేటెక్స్ కొందరిలో అలెర్జీకి కారణం కావచ్చు. కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నవారు కూడా వైద్యుల సలహా మేరకు తీసుకోవడం మంచిది.
అందువల్ల బొప్పాయి ఆరోగ్యకరమైన పండే అయినప్పటికీ, మితంగా తీసుకోవడమే ఉత్తమం. ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిస్థితి భిన్నంగా ఉంటుంది కాబట్టి, ప్రత్యేక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఆహారంలో బొప్పాయిని చేర్చుకునే ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.
గమనిక: ఈ సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్యుల సలహాకు ప్రత్యామ్నాయం కాదు.

