వంటింట్లో సువాసనలు వెదజల్లే కొత్తిమీర అంటే చాలామందికి ఎంతో ఇష్టం. వంటకాల రుచిని, సువాసనను పెంచే ఈ పచ్చటి ఆకుల్లో ఎన్నో పోషకాలు, ఔషధ గుణాలు ఉన్నాయనేది నిజమే. అయితే, ప్రతి ఒక్కరికీ కొత్తిమీర ఒకే విధంగా మేలు చేయదని వైద్యులు సూచిస్తున్నారు. కొందరు వ్యక్తులకు ఇది ప్రతికూల ప్రభావాలను కలిగించే అవకాశం ఉందని ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ కె.ఎస్. సోమశేఖర్ రావు పేర్కొంటున్నారు. ముఖ్యంగా కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కొత్తిమీరను ఎక్కువగా తీసుకుంటే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇంతకీ కొత్తిమీర ఎవరికి హానికరం? అతిగా తీసుకుంటే ఎదురయ్యే సమస్యలేంటి? అనే వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కొత్తిమీర అందరికీ మంచిది కాదు.. ఈ సమస్యలు ఉన్నవారు జాగ్రత్త!
కొత్తిమీర వంటకాల రుచిని, సువాసనను పెంచడంతో పాటు కొన్ని పోషకాలను అందిస్తుంది. అయితే కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు దీనిని అధికంగా తీసుకునే ముందు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కిడ్నీ సమస్యలు ఉన్నవారిలో శరీరం అదనపు పొటాషియాన్ని సరిగా బయటకు పంపలేకపోవచ్చు. దీంతో రక్తంలో పొటాషియం స్థాయిలు పెరిగి గుండె స్పందనలో మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది.
అలాగే తక్కువ రక్తపోటు ఉన్నవారు కొత్తిమీరను అధికంగా, ముఖ్యంగా జ్యూస్ రూపంలో తీసుకుంటే బీపీ మరింత తగ్గే అవకాశం ఉంది. ఫలితంగా తల తిరగడం, బలహీనత లేదా స్పృహ కోల్పోవడం వంటి సమస్యలు రావచ్చు.
మధుమేహం కోసం మందులు లేదా ఇన్సులిన్ వాడుతున్నవారు కూడా కొత్తిమీరను అధికంగా తీసుకోవడంలో జాగ్రత్త అవసరం. ఇది రక్తంలో చక్కెర స్థాయిలపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో, మందులతో కలిసి షుగర్ మరీ తగ్గే ప్రమాదం ఉండవచ్చు.
కొంతమందిలో కొత్తిమీర అలర్జీకి కారణమవుతుంది. దురద, చర్మంపై దద్దుర్లు, వాపు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వాడకం నిలిపివేయాలి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి తీవ్రమైన లక్షణాలు కనిపిస్తే తక్షణ వైద్య సహాయం తీసుకోవాలి.
శస్త్రచికిత్సకు సిద్ధమవుతున్నవారు కూడా కొత్తిమీరను అధిక మోతాదులో తీసుకోవడం గురించి తమ వైద్యుడికి తప్పకుండా తెలియజేయాలి. ముఖ్యంగా మందులు వాడుతున్నవారు లేదా కిడ్నీ, బీపీ, షుగర్ వంటి సమస్యలు ఉన్నవారు స్వయంగా అధిక మోతాదులో కొత్తిమీర జ్యూస్ లేదా ఇతర రూపాల్లో తీసుకోకుండా వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.
గమనిక: ఈ సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే. వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితులను బట్టి కొత్తిమీరను ఎంత మోతాదులో తీసుకోవాలో వైద్య నిపుణులను సంప్రదించి నిర్ణయించుకోవాలి.

