చిన్ననాటి నుంచి కలిసి క్రికెట్ ఆడుతూ ఎదిగిన శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మ.. ఇప్పుడు భారత క్రికెట్‌లో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. పంజాబ్ తరఫున కలిసి ఆడిన ఈ ఇద్దరు స్టార్ క్రికెటర్లు.. సోమవారం జరిగిన షెర్-ఎ-పంజాబ్ టీ20 లీగ్‌లో మాత్రం ప్రత్యర్థులుగా తలపడ్డారు.

మొహాలీలో జరిగిన ఈ మ్యాచ్‌లో గిల్ ఫజిల్కా ఫాల్కన్స్కు ప్రాతినిధ్యం వహించగా.. అభిషేక్ శర్మ అమృత్సర్ సోర్మాస్ తరఫున బరిలోకి దిగాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ఫజిల్కా ఫాల్కన్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 191 పరుగులు చేసింది.

ఈ ఇన్నింగ్స్‌లో శుభ్మన్ గిల్ తన క్లాస్ చూపించాడు. కేవలం 35 బంతుల్లో 67 పరుగులు చేశాడు. అతడి స్కోరులో 8 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. అయితే గిల్, అభిషేక్ మధ్య జరిగిన పోరు మ్యాచ్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

అభిషేక్ శర్మ వేసిన 10వ ఓవర్ తొలి బంతినే గిల్ భారీ సిక్సర్‌గా మలిచాడు. మూడో బంతికి డీప్ మిడ్‌వికెట్ వైపు ఫోర్ కొట్టగా.. ఐదో బంతికి మరో సిక్సర్ బాదాడు. దీంతో ఆ ఓవర్‌లో గిల్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు.

అయితే ఓవర్ చివరి బంతికి సీన్ ఒక్కసారిగా మారిపోయింది. భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన గిల్.. నామన్ ధీర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. తన బౌలింగ్‌లో గిల్ వికెట్ దక్కడంతో అభిషేక్ శర్మ తనదైన శైలిలో సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

అయితే గిల్‌ను ఔట్ చేసిన అభిషేక్.. బ్యాట్‌తోనూ అదరగొట్టాడు. అమృత్సర్ సోర్మాస్ ఛేజింగ్‌లో దూకుడుగా ఆడిన అతడు కేవలం 15 బంతుల్లోనే 49 పరుగులు సాధించాడు. ఇందులో 6 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి.

అభిషేక్ విధ్వంసకర ఆరంభానికి తోడు రాహుల్ కుమార్ 53, ఆకాష్ పాండే 24 పరుగులతో రాణించడంతో అమృత్సర్ సోర్మాస్ లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. మరో 3 బంతులు మిగిలి ఉండగానే విజయం అందుకుంది. దీంతో ఈ మ్యాచ్‌లో గిల్-అభిషేక్ పోరు అభిమానులకు మంచి క్రికెట్ ట్రీట్‌గా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *