స్వీట్ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి.. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టంగా తీపి పదార్థాలను ఆస్వాదిస్తుంటారు. అయితే మనం తరచూ తినే స్వీట్స్‌కు భిన్నంగా.. పాతకాలం నాటి సంప్రదాయ రుచిని గుర్తుచేసే వెన్నె ఉండలు ఒక్కసారి రుచి చూస్తే ఆ మధురమైన రుచికి ఫిదా అవ్వాల్సిందే. ఎంతో సింపుల్‌గా, ఇంట్లోనే అందుబాటులో ఉండే పదార్థాలతో వీటిని తయారు చేసుకోవచ్చు. మరి ఈ పాతకాలం ఫేవరెట్ స్వీట్‌ను ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

వెన్నె ఉండలు అంటే పాతకాలం నాటి రుచిని గుర్తు చేసే సంప్రదాయ స్వీట్. బియ్యప్పిండితో తయారు చేసే ఈ ఉండలు బయటకు కరకరలాడుతూ, లోపల మెత్తగా ఉండటంతో ఎంతో రుచిగా ఉంటాయి. ఇంట్లోనే అందుబాటులో ఉండే పదార్థాలతో వీటిని సులభంగా తయారు చేసుకోవచ్చు. మరి పిండిని ఎలా సిద్ధం చేయాలి, వెన్నె ఉండలను పగుళ్లు రాకుండా ఎలా తయారు చేసి బంగారు రంగులో వేయించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5

ముందుగా ఒక కప్పు బియ్యాన్ని తీసుకుని రెండు సార్లు శుభ్రంగా కడిగి, ఆరు గంటలపాటు లేదా రాత్రంతా నానబెట్టాలి. బియ్యం బాగా నానిన తర్వాత నీటిని పూర్తిగా వంపేసి, కాటన్ వస్త్రంపై పలుచగా పరచి నీడలో ఆరబెట్టాలి. బియ్యం పూర్తిగా ఎండిపోకుండా కొద్దిగా తేమ ఉండేలా చూసుకోవాలి. అనంతరం బియ్యాన్ని మిక్సీ జార్‌లో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఈ పిండిని జల్లెడ పట్టి మెత్తగా చేసుకోవాలి. రవ్వలా మిగిలిన పిండిని మరోసారి గ్రైండ్ చేసి జల్లించుకోవాలి.

2 / 5

ఇప్పుడు మెత్తగా జల్లించిన బియ్యప్పిండిలో రెండు చిటికెల ఉప్పు, పావు కప్పు వెన్న వేసి బాగా కలపాలి. వెన్న పిండిలో పూర్తిగా కలిసేలా చేతితో రుద్దుతూ మర్దనా చేయాలి. ఆ తర్వాత కొద్దికొద్దిగా పచ్చిపాలు పోస్తూ పిండిని గట్టిగా కలుపుకోవాలి. తడిపిండి కావడంతో ఎక్కువ పాలు అవసరం ఉండదు. సాధారణంగా రెండు నుంచి మూడు టేబుల్‌స్పూన్ల పాలు సరిపోతాయి. పిండి పల్చగా కాకుండా జాగ్రత్తగా కలుపుతూ కనీసం ఐదు నిమిషాలు మర్దనా చేయాలి. చిన్న ఉండ చేసి చూసినప్పుడు పగుళ్లు రాకుండా ఉంటే పిండి సరైన స్థితిలో ఉన్నట్లు. పిండి ఆరిపోకుండా మూత పెట్టి ఉంచాలి.

3 / 5

తయారైన పిండిని కొద్దికొద్దిగా తీసుకుని, మధ్యలో ఖాళీలు లేకుండా గట్టిగా నొక్కుతూ చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఉండలపై పగుళ్లు రాకుండా జాగ్రత్త పడాలి. ఇలా అన్ని ఉండలను తయారు చేసి మూతతో కప్పి ఉంచాలి. అనంతరం కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి మీడియం మంటపై వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత కొన్ని ఉండలను నూనెలో వేసి వెంటనే కదపకుండా ఒకటి, రెండు నిమిషాలు ఉంచాలి. ఆ తర్వాత నెమ్మదిగా తిప్పుతూ అన్ని వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చే వరకు వేయించాలి. వేగిన వెన్నె ఉండలను నూనెలో నుంచి తీసి పక్కన పెట్టుకోవాలి.

4 / 5

ఇలా తయారు చేసిన వెన్నె ఉండలు బయటకు కరకరలాడుతూ, లోపల మెత్తగా ఉంటాయి. వేడిగా ఉన్నప్పుడే తింటే వీటి రుచి మరింత బాగుంటుంది. టీ లేదా కాఫీతో పాటు సాయంత్రం స్నాక్‌గా కూడా వీటిని ఆస్వాదించవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *