
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ, ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపాయి. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి, ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరాలను ఆనుకుని కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
మంగళ, బుధవారాల్లో కోస్తాంధ్ర జిల్లాలతో పాటు రాయలసీమలోని నంద్యాల, అనంతపురం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఇప్పటికే సోమవారం ఉమ్మడి గుంటూరు జిల్లాలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. గుంటూరుతో పాటు తాడికొండ, మేడికొండూరు, నరసరావుపేట, పిడుగురాళ్ల, సత్తెనపల్లి ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు పడ్డాయి. కోనసీమ జిల్లాలోనూ మోస్తరు వర్షాలు నమోదయ్యాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో గత రెండు రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి.
అప్రమత్తంగా ఉండాలని సూచన
ఉరుములు, పిడుగులు, ఈదురుగాలులతో వర్షాలు కురిసే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. చెట్లు, విద్యుత్ స్తంభాల కింద నిలబడవద్దని, పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలని సూచించారు.
ఈ ఏడాది రాష్ట్రంలో వర్షపాతం ఆశించిన స్థాయిలో లేకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఖరీఫ్ సాగుకు అవసరమైన వర్షాలు సకాలంలో లేకపోవడంతో పంటలపై ప్రభావం పడింది. తాజాగా కురుస్తున్న వర్షాలు కొంత ఊరటనిస్తున్న నేపథ్యంలో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో రైతులు, ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు.
