లండన్: యునైటెడ్‌ కింగ్‌డమ్‌ భవిష్యత్తుపై మరోసారి చర్చ మొదలైంది. బ్రిటన్‌ నుంచి విడిపోయి తమ ప్రాంతాల భవిష్యత్తును తామే నిర్ణయించుకునే హక్కు కావాలంటూ స్కాట్లాండ్‌, వేల్స్‌, ఉత్తర ఐర్లాండ్‌కు చెందిన ప్రధాన జాతీయవాద పార్టీల నేతలు తొలిసారి ఒకే వేదికపైకి వచ్చారు.

వేల్స్‌ రాజధాని కార్డిఫ్‌లో జరిగిన సమావేశంలో స్కాటిష్‌ నేషనల్‌ పార్టీ (SNP) నేత జాన్‌ స్విన్నీ, ప్లెయిడ్‌ సైమ్రూ నేత రున్‌ ఆప్‌ ఇయోర్త్‌, సిన్‌ ఫెయిన్‌ నేతలు మేరీ లూ మెక్‌డొనాల్డ్‌, మిచెల్‌ ఓ’నీల్‌ పాల్గొన్నారు. తమ ప్రాంతాల ప్రజలకు స్వయం నిర్ణయ హక్కు ఉందని, వెస్ట్‌మినిస్టర్‌ ప్రభుత్వం వారి ఆకాంక్షలను అడ్డుకోకూడదని సంయుక్త ప్రకటనలో స్పష్టం చేశారు.

విడిపోవడమే లక్ష్యం

SNP స్కాట్లాండ్‌కు స్వాతంత్ర్యం కోరుతుండగా, ప్లెయిడ్‌ సైమ్రూ వేల్స్‌కు మరింత స్వయం ప్రతిపత్తి, భవిష్యత్తులో స్వాతంత్ర్యం లక్ష్యంగా పనిచేస్తోంది. సిన్‌ ఫెయిన్‌ ఉత్తర ఐర్లాండ్‌ను ఐర్లాండ్‌ రిపబ్లిక్‌తో విలీనం చేయాలని, ఇందుకోసం ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలని కోరుతోంది.

మూడు పార్టీలూ తమ ప్రాంతాల భవిష్యత్తు యూరోపియన్‌ యూనియన్‌తో అనుసంధానమై ఉండాలని చెబుతున్నాయి. బ్రిటన్‌లో రాజ్యాంగ మార్పులు తప్పవని, స్వాతంత్ర్య ఉద్యమాలకు మరింత ఊపు వస్తోందని పేర్కొన్నాయి.

బ్రిటన్‌కు కొత్త సవాలు

స్కాట్లాండ్‌లో మరోసారి స్వాతంత్ర్య ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలన్న డిమాండ్‌ను లండన్‌ ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో మూడు ప్రాంతాల పార్టీల తాజా ఐక్యత బ్రిటన్‌ ప్రభుత్వానికి కొత్త రాజకీయ సవాలుగా మారింది.

అయితే ఆయా ప్రాంతాలు నిజంగా విడిపోతే ఆర్థిక వ్యవస్థ, కరెన్సీ, రక్షణ, అంతర్జాతీయ గుర్తింపు వంటి అంశాలపై అనేక ప్రశ్నలు తలెత్తనున్నాయి. దీంతో యునైటెడ్‌ కింగ్‌డమ్‌ ఐక్యంగా కొనసాగుతుందా, లేక భవిష్యత్తులో విభజన దిశగా వెళ్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *