
నరసరావుపేట: మావోయిస్టు ఉద్యమానికి చెందిన ఇద్దరు సీనియర్ క్యాడర్లు హింసా మార్గాన్ని వీడి పోలీసుల ఎదుట లొంగిపోయారు. పల్నాడు జిల్లా అదనపు ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి ఎదుట సోమవారం వారు లొంగిపోయినట్లు జిల్లా పోలీసులు తెలిపారు.
లొంగిపోయిన వారిలో విశాఖపట్నం జిల్లా అక్కయ్యపాలెంకు చెందిన కందర్ప దుర్గాప్రసాద్ అలియాస్ మోహన్, పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం శ్రీరాంపురం తండాకు చెందిన ఆయన భార్య గొడ్డెళ్ల లచ్చుమమ్మ అలియాస్ ఉమా ఉన్నారు.
మావోయిస్టు పార్టీలో కీలక బాధ్యతలు
పోలీసుల వివరాల ప్రకారం.. దుర్గాప్రసాద్ మావోయిస్టు పార్టీలో డివిజనల్ కమిటీ సభ్యుడిగా, అర్బన్ డెన్ కీపర్‌గా పనిచేశారు. ఆయన భార్య లచ్చుమమ్మ జిల్లా కమిటీ సభ్యురాలిగా, అర్బన్ డెన్ కీపర్‌గా బాధ్యతలు నిర్వహించారు. వీరిద్దరూ డీసీఎం స్థాయి క్యాడర్లుగా పనిచేసినట్లు పోలీసులు వెల్లడించారు.
పట్టణ ప్రాంతాల్లో ఉంటూ కేంద్ర, రాష్ట్ర కమిటీ సభ్యులతో సమన్వయం చేసుకుంటూ పార్టీ కార్యకలాపాల్లో కీలకంగా వ్యవహరించినట్లు తెలిపారు.
సిద్ధాంతాలపై విసుగుతో లొంగుబాటు
మావోయిస్టు పార్టీ వరుస వైఫల్యాలు, కాలం చెల్లిన సిద్ధాంతాలతో విసిగిపోయిన తాము ఉద్యమం నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు దంపతులు తెలిపారు. హింసను వీడి సాధారణ జీవితం గడపాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అమలు చేస్తున్న లొంగుబాటు, పునరావాస విధానాలపై అవగాహనతో పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు చెప్పారు.
పునరావాసం కల్పిస్తాం: అదనపు ఎస్పీ
హింసా మార్గాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలవాలనుకునే వారు ప్రభుత్వం అందిస్తున్న లొంగుబాటు, పునరావాస విధానాలను సద్వినియోగం చేసుకోవాలని అదనపు ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి సూచించారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం పునరావాసం, అవసరమైన సహాయాన్ని అందిస్తామని తెలిపారు.
