
కర్నూలు: భక్తులు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యుల విజ్ఞప్తుల మేరకు ఈసారి వినాయక నిమజ్జనాన్ని కేసీ కెనాల్‌లోనే నిర్వహించాలని నిర్ణయించినట్లు రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో నిమజ్జన ఏర్పాట్లపై ఉత్సవ కమిటీ సభ్యులు, వివిధ శాఖల అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు.
కర్నూలులో నాలుగు దశాబ్దాలకు పైగా కొనసాగుతున్న వినాయక నిమజ్జన సంప్రదాయాన్ని కొనసాగిస్తూ కేసీ కెనాల్‌లోనే కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు.
నీటి కొరత నేపథ్యంలో ఏర్పాట్లు
సుంకేసుల బ్యారేజీలో నీటి లభ్యత తక్కువగా ఉండటంతో కేసీ కెనాల్‌కు నీరు వచ్చే అవకాశం లేదని మంత్రి చెప్పారు. తాగునీటి అవసరాల కోసం నీటిని నిల్వ చేస్తున్న నేపథ్యంలో, కేసీ కెనాల్లో అప్‌స్ట్రీమ్, డౌన్‌స్ట్రీమ్ ప్రాంతాల్లో అడ్డుగోడలు ఏర్పాటు చేసి సుమారు 600 మీటర్ల మేర నిమజ్జనానికి అనుకూలంగా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు.
కర్నూలు నీటి సరఫరా కేంద్రం నుంచి వచ్చే నీరు, బ్యాక్‌వాటర్ తదితర మార్గాల ద్వారా సుమారు 20 లక్షల లీటర్ల నీటిని అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. నిమజ్జన సమయానికి 6 నుంచి 9 అడుగుల నీటి మట్టం ఉండేలా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. క్రేన్లు, ఘాట్, భద్రతా ఏర్పాట్లు, ఇతర మౌలిక వసతులను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.
ప్రత్యామ్నాయ ప్రాంతాల పరిశీలన
హంద్రీనీవా కాలువ పరిధిలోని నన్నూరు టోల్గేట్, తడకనపల్లి, ఉలిందకొండ ప్రాంతాలను పరిశీలించినప్పటికీ.. భక్తుల అభిప్రాయాలను గౌరవిస్తూ కేసీ కెనాల్‌కే ప్రాధాన్యం ఇచ్చినట్లు మంత్రి తెలిపారు.
పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత మాట్లాడుతూ.. భక్తుల సెంటిమెంట్‌కు అనుగుణంగా ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ నిమజ్జన కార్యక్రమం సందర్భంగా పటిష్ట బందోబస్తు, భద్రతా చర్యలు చేపడతామని తెలిపారు. అధికారులు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో సమన్వయం చేసుకుని ఏర్పాట్లు పూర్తి చేస్తామని వెల్లడించారు.
