వైఎస్సార్‌సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి విదేశీ పర్యటనకు సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతి ఇచ్చింది. 15 రోజులపాటు యూరప్‌లో పర్యటించేందుకు షరతులతో కూడిన అనుమతిని మంజూరు చేసింది. అక్టోబర్ 1 నుంచి నవంబర్ 30 మధ్య ఎప్పుడైనా ఈ పర్యటనను పూర్తి చేసుకునే వెసులుబాటు కల్పించింది.

విదేశీ పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలను ముందుగానే కోర్టుకు సమర్పించాలని జగన్‌ను కోర్టు ఆదేశించింది. యూరప్‌లో పర్యటించే సమయంలో అందుబాటులో ఉండే ఫోన్ నంబర్, ఈ-మెయిల్ వివరాలను సీబీఐకి అందించాలని సూచించింది. పర్యటనకు సంబంధించిన షెడ్యూల్, ఇతర వివరాలను కూడా ముందుగా తెలియజేయాలని స్పష్టం చేసింది.

అలాగే పూచీకత్తు సమర్పించాలని, విదేశీ పర్యటన ముగించుకుని తిరిగి వచ్చిన తర్వాత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో జగన్ విదేశాలకు వెళ్లేందుకు కోర్టు ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో యూరప్ పర్యటనకు అనుమతి కోరుతూ ఆయన నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు తాజా అనుమతులు జారీ చేసింది.

గతంలోనూ విదేశీ పర్యటనలకు వెళ్లిన సమయంలో జగన్ కోర్టు అనుమతి తీసుకున్నారు. ఈసారి అక్టోబర్ 1 నుంచి నవంబర్ 30 మధ్య 15 రోజుల పర్యటనకు కోర్టు అనుమతించింది.

ఇదిలా ఉండగా, అక్టోబర్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉందనే చర్చ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల షెడ్యూల్‌కు అనుగుణంగా జగన్ తన విదేశీ పర్యటన తేదీలను ఖరారు చేసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే పర్యటనకు సంబంధించిన తుది తేదీలు ఇంకా వెల్లడికావాల్సి ఉంది.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *