
ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ విమాన ప్రయాణాలపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. పవన్ కళ్యాణ్, లోకేష్ అధికారిక పర్యటనలకు ఆంధ్రప్రదేశ్ ఏవియేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (APACL) నుంచి ఎలాంటి ఖర్చు చేయడం లేదని ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ తెలిపింది. వారు తమ సొంత ఖర్చులతోనే విమాన ప్రయాణాలు చేస్తున్నారని పేర్కొంది.
సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి పర్యటనలకు ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్ల వినియోగం పేరుతో ప్రభుత్వ ఖజానా నుంచి కోట్ల రూపాయలు దుర్వినియోగం చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేసింది.
APACL బడ్జెట్ కేవలం ముఖ్యమంత్రి పర్యటనల కోసమే కాదని ప్రభుత్వం తెలిపింది. గవర్నర్, కేంద్ర మంత్రుల పర్యటనలకు హెలికాప్టర్ సేవలు, గిరిజన ప్రాంతాల్లో ఎయిర్ అంబులెన్స్ సేవలు, విదేశాల్లో లేదా ఇతర ప్రాంతాల్లో చిక్కుకున్న తెలుగు ప్రజలను తరలించేందుకు ప్రత్యేక విమానాల వంటి సేవలకు కూడా ఈ నిధులు వినియోగిస్తారని పేర్కొంది.
2026-27 ఆర్థిక సంవత్సరానికి APACLకు రూ.54.63 కోట్ల బడ్జెట్ కేటాయించగా, తొలి రెండు త్రైమాసికాలకు కలిపి రూ.30.95 కోట్లు మాత్రమే విడుదల చేసినట్లు తెలిపింది. ఈ నిధులు బడ్జెట్ పరిమితులకు లోబడే వినియోగిస్తున్నట్లు స్పష్టం చేసింది.
2021-22 నుంచి 2023-24 వరకు జిల్లాల పర్యటనలకు ఏటా రూ.51.45 కోట్ల నుంచి రూ.55 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. కోవిడ్ పరిమితులు ఉన్న 2020-21లోనూ రూ.30 కోట్ల బడ్జెట్ వినియోగించినట్లు తెలిపింది.
ప్రస్తుతం సీఎం చంద్రబాబు వివిధ సంక్షేమ కార్యక్రమాల అమలు, పర్యవేక్షణ కోసం విస్తృతంగా జిల్లాల్లో పర్యటిస్తున్నారని, అయినప్పటికీ విమానయాన ఖర్చులు కేటాయించిన బడ్జెట్ పరిధిలోనే ఉన్నాయని ప్రభుత్వం పేర్కొంది. సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని ప్రజలకు సూచించింది.
