మంచి కంటెంట్‌కు భాషల హద్దులు ఉండవని ‘ప్రేమలు’, ‘బెత్లహెం కుటుంబ యూనిట్’ సినిమాలు నిరూపించాయి. ఈ రెండు చిత్రాలను నిర్మించిన భావనా స్టూడియోస్ ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌ను ప్రకటించింది. ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీకి ప్రాధాన్యమిస్తూ తెరకెక్కుతున్న ‘పిక్నిక్’ (Picnic) సినిమాను అధికారికంగా అనౌన్స్ చేసింది.

‘ప్రేమలు’, ‘బెత్లహెం కుటుంబ యూనిట్’ చిత్రాలకు సహ రచయితగా పనిచేసిన కిరణ్ జోస్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. భావనా స్టూడియోస్ బ్యానర్‌పై ఫహద్ ఫాసిల్, దిలీష్ పోతన్, శ్యామ్ పుష్కరన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సందీప్ ప్రదీప్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. ఇంద్రజిత్ సుకుమారన్, దిలీష్ పోతన్, సుజినా శ్రీధరన్, అక్షత అజిత్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

పూర్తిస్థాయి ఫ్యామిలీ కామెడీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు గోవింద్ వసంత సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ‘96’, ‘సత్యం సుందరం’ వంటి చిత్రాలతో తన సంగీతంతో ఆకట్టుకున్న ఆయన ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.

ఇక ‘పిక్నిక్’ ఫస్ట్ లుక్‌ను కూడా మేకర్స్ విడుదల చేశారు. పచ్చని కొండలు, రంగురంగుల పూల పొలాల నేపథ్యంలో రూపొందించిన పోస్టర్ ఆహ్లాదకరంగా కనిపిస్తోంది. పోస్టర్ చూస్తేనే ఇది కుటుంబ ప్రేక్షకులను టార్గెట్ చేసే ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతోందనే విషయం స్పష్టమవుతోంది.

మలయాళానికే పరిమితం కాకుండా దక్షిణాది మార్కెట్‌లోనూ సినిమాను తీసుకెళ్లేందుకు మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో ‘పిక్నిక్’ను ఒకేసారి విడుదల చేయనున్నారు. 2027 జనవరి 14న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సినిమాను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.

తెలుగు వెర్షన్ విషయంలోనూ చిత్రబృందం ముందుగానే ప్లాన్ చేసింది. ప్రముఖ నిర్మాణ, పంపిణీ సంస్థ షోయింగ్ బిజినెస్ తెలుగు థియేట్రికల్ రిలీజ్ కోసం ‘పిక్నిక్’తో ఒప్పందం కుదుర్చుకుంది. గతంలో ‘ప్రేమలు’ను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన ఈ సంస్థకు ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. దీంతో ‘పిక్నిక్’పై తెలుగు ప్రేక్షకుల్లోనూ ఆసక్తి మొదలైంది.

సినిమాకు సంబంధించిన టీజర్, పాటలు, ఇతర ప్రమోషనల్ కంటెంట్‌ను త్వరలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *