
హీరో సందీప్ కిషన్ నటిస్తున్న ‘సిగ్మా’ సినిమాపై ఇప్పటికే మంచి ఆసక్తి నెలకొంది. తమిళ స్టార్ హీరో విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతుండటంతో ప్రాజెక్ట్‌పై ప్రత్యేకమైన బజ్ ఏర్పడింది. లైకా ప్రొడక్షన్స్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ యాక్షన్ అడ్వెంచర్ హీస్ట్ మూవీ అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు.
ట్రైలర్‌ను చూస్తే భారీ క్రైమ్ నెట్‌వర్క్, అండర్‌వరల్డ్ మాఫియా, హై-స్టేక్స్ యాక్షన్ చుట్టూ కథ సాగనున్నట్లు తెలుస్తోంది. ఏకంగా రూ.500 కోట్ల డ్రగ్స్, క్యాసినో రాకెట్ నేపథ్యంలో సందీప్ కిషన్ పాత్రను ఆసక్తికరంగా చూపించారు. స్టైలిష్ బాడీ లాంగ్వేజ్, ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్‌తో సందీప్ ఆకట్టుకోగా.. యాక్షన్ సన్నివేశాల్లో అతడి స్క్రీన్ ప్రెజెన్స్ ప్రత్యేకంగా కనిపిస్తోంది.
ఫరియా అబ్దుల్లా కూడా కీలక పాత్రలో కనిపించింది. సందీప్, ఫరియా మధ్య కెమిస్ట్రీకి కూడా ట్రైలర్‌లో ప్రాధాన్యత ఇచ్చారు. యాక్షన్, అడ్వెంచర్, కామెడీ అంశాలతో పాటు తల్లి-కొడుకు అనుబంధం చుట్టూ సాగే ఎమోషనల్ ట్రాక్ కూడా కథలో ముఖ్యమైన భాగంగా కనిపిస్తోంది. దీంతో కేవలం క్రైమ్, హీస్ట్ అంశాలకే పరిమితం కాకుండా ఫ్యామిలీ ఎమోషన్‌ను కూడా దర్శకుడు జాసన్ సంజయ్ కథలో మిళితం చేసినట్లు తెలుస్తోంది.
తొలి సినిమాతోనే జాసన్ సంజయ్ కమర్షియల్ ఎలిమెంట్స్‌తో కూడిన భారీ కథను ఎంచుకున్నట్లు ట్రైలర్ సూచిస్తోంది. టెక్నికల్‌గానూ సినిమా రిచ్‌గా కనిపిస్తోంది. కృష్ణన్ వసంత్ సినిమాటోగ్రఫీ యాక్షన్ సన్నివేశాలకు స్టైలిష్ లుక్ తీసుకురాగా.. ఎస్. థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌కు మరింత ఎనర్జీని జోడించింది. లైకా ప్రొడక్షన్స్ నిర్మాణ విలువలు కూడా ట్రైలర్‌లో స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఇప్పటికే పాటలు, పోస్టర్లతో ఆసక్తిని పెంచుకున్న ‘సిగ్మా’.. తాజా ట్రైలర్‌తో హీస్ట్, యాక్షన్ ఎలిమెంట్స్‌పై మరింత క్యూరియాసిటీ పెంచింది. అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ లిమిటెడ్, ఎన్వీఆర్ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాయి. దర్శకుడిగా జాసన్ సంజయ్ తొలి ప్రయత్నం ఎలాంటి థియేట్రికల్ అనుభూతిని అందిస్తుందో తెలియాలంటే అక్టోబర్ 2 వరకు వేచి చూడాల్సిందే.
