సూపర్‌స్టార్ రజనీకాంత్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘జైలర్ 2’ ప్రమోషన్స్ మొదలయ్యాయి. 2023లో విడుదలైన ‘జైలర్’ భారీ విజయాన్ని అందుకోవడంతో.. దానికి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై మొదటి నుంచే అంచనాలు నెలకొన్నాయి. సన్ పిక్చర్స్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రానికి నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. రజనీకాంత్ మరోసారి ముత్తువేల్ పాండియన్ పాత్రలో కనిపించనున్నారు.

తాజాగా ‘జైలర్ 2’ నుంచి తొలి క్యారెక్టర్ ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో మలయాళ నటుడు సూరజ్ వెంజరమూడును ‘దిలీప్’ పాత్రలో పరిచయం చేశారు. కేవలం 35 సెకన్ల నిడివి ఉన్న ఈ ప్రోమోలో సూరజ్‌ను స్టైలిష్, ఇంటెన్స్ లుక్‌లో చూపించారు. ఆయన పాత్రకు పవర్‌ఫుల్ ఇమేజ్ వచ్చేలా ప్రోమోను డిజైన్ చేశారు. అనిరుధ్ రవిచందర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ క్యారెక్టర్ ఇంట్రోకు మరింత ఇంపాక్ట్ తీసుకొచ్చింది.

ఇక ‘జైలర్ 2’లో మొదటి భాగంలోని పలువురు నటీనటులు తమ పాత్రలను కొనసాగించనున్నారు. రమ్యకృష్ణ, యోగిబాబు, మీర్నా కీలక పాత్రల్లో మరోసారి కనిపించనున్నారు. అదే సమయంలో సీక్వెల్ కోసం మరింత భారీ తారాగణాన్ని తీసుకొచ్చారు. శివ రాజ్‌కుమార్, మోహన్‌లాల్ కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నట్లు సమాచారం.

ఇప్పటికే విడుదలైన ‘జైలర్ 2’ గ్లింప్స్‌కు మంచి స్పందన వచ్చింది. మొదటి భాగం తర్వాత ముత్తువేల్ పాండియన్ ఎదుర్కొనే మరో పెద్ద సమస్యను సీక్వెల్‌లో చూపించనున్నట్లు గ్లింప్స్ ద్వారా హింట్ ఇచ్చారు. దీంతో కథ ఎలా ఉండబోతుందనే ఆసక్తి మరింత పెరిగింది.

కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. మేకర్స్ ప్రకటించిన వివరాల ప్రకారం 2026 అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా ‘జైలర్ 2’ థియేటర్లలో విడుదల కానుంది.

ఇక రజనీకాంత్ తదుపరి సినిమాల విషయానికి వస్తే.. అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ధర్మన్’లో ఆయన నటిస్తున్నారు. ఇందులో రజనీకాంత్ స్టైలిష్ డాక్టర్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. సిమ్రాన్, యోగిబాబు, రాశి ఖన్నా కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే కమల్ హాసన్తో కలిసి ‘KHxRK’ అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న మరో ప్రాజెక్ట్‌లోనూ రజనీకాంత్ నటించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *