వాతావరణ మార్పుల ప్రభావంతో దక్షిణ భారతదేశం వేగంగా ఎండిపోతున్నట్లు ఓ తాజా అధ్యయనం వెల్లడించింది. ముఖ్యంగా తూర్పు తీరంలోని ఆంధ్రప్రదేశ్ తీవ్రమైన కరువు ముప్పును ఎదుర్కొంటున్న ప్రాంతాల్లో ఒకటిగా మారుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల్లోనూ ఇదే తరహా పరిస్థితులు కనిపిస్తున్నట్లు అధ్యయనం పేర్కొంది.

1971 నుంచి 2022 వరకు 52 ఏళ్ల వాతావరణ డేటాను విశ్లేషించిన పరిశోధకులు ఈ అంశాలను వెల్లడించారు. భారత వాతావరణ శాఖ (IMD), నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్‌కాస్టింగ్ (NCMRWF)కు చెందిన శాస్త్రవేత్తలు సంయుక్తంగా ఈ అధ్యయనం నిర్వహించారు. పరిశోధన ఫలితాలు ‘ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ క్లైమాటాలజీ’లో ప్రచురితమయ్యాయి.

అధ్యయనం ప్రకారం.. 2000 సంవత్సరం తర్వాత దక్షిణ భారతదేశంలో ఎండిపోయే పరిస్థితులు మరింత తీవ్రంగా మారాయి. ఈ కాలంలో ఈ ప్రాంతం పలుమార్లు కరువు పరిస్థితులను ఎదుర్కొన్నట్లు పరిశోధకులు గుర్తించారు. ముఖ్యంగా తూర్పు తీరం వాతావరణ మార్పుల ప్రభావానికి ఎక్కువగా గురవుతున్న ప్రాంతంగా మారుతోందని వారు పేర్కొన్నారు.

వాతావరణ మార్పుల కారణంగా కరువు పరిస్థితులు వేగంగా పెరుగుతున్నాయని పరిశోధకులు హెచ్చరించారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో నీటి వనరులు, వ్యవసాయం, ప్రజా ఆరోగ్యం, మౌలిక సదుపాయాలపై దీర్ఘకాలిక ప్రభావం పడే అవకాశం ఉందని సూచించారు.

ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు దక్షిణాది రాష్ట్రాలు ముందస్తు ప్రణాళికలు రూపొందించుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. వ్యవసాయం, సాగునీటి నిర్వహణ, ప్రజారోగ్యం, మౌలిక సదుపాయాల రంగాల్లో వాతావరణ మార్పులకు అనుగుణంగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని తెలిపారు.

అంతేకాకుండా రాష్ట్రాల సగటు పరిస్థితులను మాత్రమే పరిగణనలోకి తీసుకోకుండా.. స్థానిక స్థాయిలో నీటి కొరత, కరువు పరిస్థితులను గుర్తించే పర్యవేక్షణ వ్యవస్థలను మరింత బలోపేతం చేయాలని సూచించారు. అధ్యయనంలో ఉపయోగించిన ‘క్లైమేట్ ఇండెక్స్’ వంటి సూచికల ఆధారంగా ఏ ప్రాంతంలో ఎప్పుడు నీటి ఎద్దడి ఏర్పడే అవకాశం ఉందో ముందుగానే అంచనా వేసి, దానికి అనుగుణంగా ప్రభుత్వాలు కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని పరిశోధకులు సూచించారు.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *