రాయలసీమ విమాన ప్రయాణికులకు కడప విమానాశ్రయ అధికారులు కీలక సూచన చేశారు. దుబాయ్‌ నుంచి కడపకు ఇండిగో కొత్త విమాన సర్వీస్‌ ఈ నెల 23 నుంచి ప్రారంభమవుతుందంటూ సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని కడప విమానాశ్రయ డైరెక్టర్‌ సుజిత్‌ కుమార్‌ పొద్దార్‌ స్పష్టం చేశారు. ఈ విమాన సర్వీస్‌కు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదని తెలిపారు.

సెప్టెంబరు 23 నుంచి దుబాయ్‌-కడప మధ్య ఇండిగో విమాన సర్వీస్‌ ప్రారంభమవుతుందంటూ కొంతకాలంగా సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీంతో కడప నుంచి దుబాయ్‌కు నేరుగా విమాన ప్రయాణం అందుబాటులోకి వస్తుందా అనే ఆసక్తి ప్రయాణికుల్లో నెలకొంది. అయితే ఈ ప్రచారాన్ని కడప విమానాశ్రయ అధికారులు ఖండించారు.

దుబాయ్‌ నుంచి కడపకు కొత్త విమాన సర్వీస్‌ ప్రారంభమవుతున్నట్లు సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని ఎయిర్‌పోర్ట్‌ డైరెక్టర్‌ తెలిపారు. ఎలాంటి అధికారిక ప్రకటన లేకుండానే జరుగుతున్న ఈ ప్రచారాన్ని ప్రయాణికులు నమ్మవద్దని సూచించారు. ముఖ్యంగా సోషల్‌ మీడియా ప్రచారాన్ని నమ్మి ట్రావెల్‌ ఏజెన్సీల ద్వారా టికెట్లు బుక్‌ చేసుకుని మోసపోయే అవకాశం ఉందని హెచ్చరించారు.

విమాన సర్వీసులకు సంబంధించి ప్రయాణికులకు ఏవైనా సందేహాలు ఉంటే నేరుగా విమానాశ్రయ అధికారులు, సిబ్బందిని సంప్రదించాలని సూచించారు. భవిష్యత్తులో దుబాయ్‌ నుంచి కడపకు విమాన సర్వీస్‌ ఏర్పాటు చేస్తే, దానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడుతుందని స్పష్టం చేశారు. అప్పటివరకు సోషల్‌ మీడియాలో వస్తున్న ప్రచారాన్ని విశ్వసించవద్దని ప్రయాణికులకు సూచించారు.

ఏపీలో ఆరు విమానాశ్రయాలు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఆరు ప్రధాన విమానాశ్రయాలు అందుబాటులో ఉన్నాయి. విజయనగరంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం, విజయవాడ గన్నవరం విమానాశ్రయం, తిరుపతి రేణిగుంట విమానాశ్రయం, రాజమహేంద్రవరం విమానాశ్రయం, కడప విమానాశ్రయం, కర్నూలు విమానాశ్రయాలు ఉన్నాయి. వీటితో పాటు పుట్టపర్తిలో శ్రీ సత్యసాయి ప్రైవేట్‌ ఎయిర్‌స్ట్రిప్‌ కూడా ఉంది.

రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లో కొత్త విమానాశ్రయాల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. కొత్త విమానాశ్రయాల ఏర్పాటుపై కేంద్ర స్థాయిలో కసరత్తు కొనసాగుతోంది.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *