
బంగాళాఖాతంలోని ఉత్తర అండమాన్ సముద్రం పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడింది. ఇది సోమవారం నాటికి వాయుగుండంగా, మంగళవారం నాటికి తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 23న దక్షిణ ఒడిశా–ఉత్తరాంధ్ర మధ్య తీరం దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
దీని ప్రభావంతో సోమవారం నుంచి నాలుగు రోజుల పాటు కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, కడప, శ్రీ సత్యసాయి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
శ్రీకాకుళం జిల్లాకు ప్రత్యేక హెచ్చరిక జారీ చేశారు. ఈ నెల 21 నుంచి వర్షాలు మొదలై 22, 23 తేదీల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. తీర ప్రాంతాల్లో గంటకు 50–60 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు ఈ నెల 25 వరకు సముద్రంలోకి వెళ్లవద్దని అధికారులు సూచించారు.
తుపాను ముప్పు నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో 11 తీర మండలాలకు సీనియర్ అధికారులను నియమించి, పునరావాస కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి అధికారుల సూచనలు పాటించాలని కోరారు.
