ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టుల ప్రక్రియ వేగవంతమవుతోంది. వివిధ ప్రాంతాలను పోర్టులతో అనుసంధానించేందుకు ప్రతిపాదించిన ప్రాజెక్టులకు సంబంధించి ఫైనల్‌ లొకేషన్‌ సర్వేలు (FLS), డీపీఆర్‌ల తయారీపై రైల్వేశాఖ దృష్టి పెట్టింది. మొత్తం 9 కీలక ప్రాజెక్టులపై పనులు కొనసాగుతున్నాయి.

వీటిలో సికింద్రాబాద్‌–శ్రీశైలం–మార్కాపురం కొత్త రైల్వే లైన్‌ కీలకమైనది. సుమారు 290 కి.మీ. పొడవున నిర్మించే ఈ లైన్‌తో తెలంగాణ, పశ్చిమ, మధ్య భారత ప్రాంతాల నుంచి శ్రీశైలానికి రైలు కనెక్టివిటీతో పాటు రామాయపట్నం, కృష్ణపట్నం పోర్టులకు ప్రత్యామ్నాయ మార్గం అందుబాటులోకి రానుంది.

గద్వాల్‌–మాచర్ల మధ్య 184.2 కి.మీ. కొత్త లైన్‌, దొనకొండ–ఒంగోలు మధ్య 119.6 కి.మీ. లైన్‌ కూడా ప్రతిపాదించారు. దొనకొండ ఇండస్ట్రియల్‌ జోన్‌ను రామాయపట్నం పోర్టుతో అనుసంధానించేలా డీపీఆర్‌ సిద్ధమవుతోంది.

అలాగే దూపాడు–బేతంచెర్ల మధ్య 53.9 కి.మీ., రాజంపేట–నెల్లూరు మధ్య 120 కి.మీ. కొత్త రైల్వే లైన్లకు ప్రతిపాదనలు వచ్చాయి. రాయలసీమ, కర్ణాటక ప్రాంతాల నుంచి కృష్ణపట్నం, రామాయపట్నం పోర్టులకు కనెక్టివిటీ మెరుగుపడే అవకాశం ఉంది.

గూడూరు–దుగరాజపట్నం పోర్టు మధ్య 41.5 కి.మీ., పుత్తూరు–అట్టిపట్టు మధ్య 88.3 కి.మీ. లైన్లను కూడా ప్రతిపాదించారు. వీటితో పోర్టులకు రైలు రవాణా సౌకర్యం మరింత మెరుగుపడనుంది.

ఇక చింతూరు–సామర్లకోట మధ్య 150 కి.మీ. కొత్త లైన్‌తో ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ ప్రాంతాల నుంచి కాకినాడ పోర్టుకు కనెక్టివిటీ పెరగనుంది. మరోవైపు ఒడిశాలోని తేరుబలి–గుణుపూర్ 73.6 కి.మీ. రైల్వే లైన్‌కు ఇప్పటికే ఆమోదం లభించింది. దీంతో మూలపేట పోర్టుకు కనెక్టివిటీ మెరుగుపడనుంది.

ఈ ప్రాజెక్టులు పూర్తయితే ఏపీలోని పలు పోర్టులకు రైలు మార్గాల ద్వారా సరకు రవాణా సులభమై, ప్రయాణ సమయం, రవాణా ఖర్చులు తగ్గే అవకాశం ఉంది.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *