
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశాఖపట్నంలో పర్యటించారు. ఈ సందర్భంగా 28 వేలకుపైగా టిడ్కో ఇళ్ల పట్టాలను అందజేశారు. అనంతరం ఆర్కే బీచ్‌లో నిర్వహించిన స్వర్ణాంధ్ర–స్వచ్ఛంద్ర కార్యక్రమంలో పాల్గొని పారిశుద్ధ్య సిబ్బందితో కలిసి ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్తను తొలగించారు.
బీచ్‌ను పరిశుభ్రంగా ఉంచడం అందరి బాధ్యత అని సీఎం అన్నారు. గణపతి నిమజ్జనాల సందర్భంగా పారిశుద్ధ్య నిర్వహణపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిమజ్జనాలు రాత్రి వరకు కొనసాగినా.. ఉదయం ఆరు గంటలకల్లా బీచ్‌ను శుభ్రం చేస్తున్నట్లు అధికారులు సీఎంకు వివరించారు. మూడు షిఫ్టుల్లో 42 మంది పారిశుద్ధ్య కార్మికులు విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా బీచ్‌లోని చిరు వ్యాపారులతో చంద్రబాబు మాట్లాడారు. మూరీ మిక్చర్ విక్రయిస్తున్న అట్టాడ నాగమణి వద్ద మూరీ మిక్చర్ రుచి చూసి అభినందించారు. తన వ్యక్తిగత పరిస్థితిని ఆమె సీఎంకు వివరించగా, ఆమెకు ఒంటరి మహిళ పెన్షన్ అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
విశాఖలో పర్యటించిన సీఎం.. బీచ్ పరిశుభ్రత, నిమజ్జన ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు.
