వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మద్యం కుంభకోణంలో మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిదే కీలక పాత్ర అని మంత్రి కొలుసు పార్థసారథి ఆరోపించారు. ఈ వ్యవహారంలో సుమారు రూ.4 వేల కోట్ల మేర అక్రమాలు జరిగాయని ఆయన పేర్కొన్నారు.

మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. మద్యం కుంభకోణంపై జగన్‌ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కేసులో నిందితుడిగా ఉన్న సత్యప్రసాద్‌ అప్రూవర్‌గా మారడంతో, ఆయనపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని పార్థసారథి ఆరోపించారు.

వైసీపీ అధికారంలోకి రాకముందు సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తామని హామీ ఇచ్చిందని, అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం విధానంలో అక్రమాలు జరిగాయని మంత్రి విమర్శించారు. వైసీపీ పాలనలో తీసుకొచ్చిన మద్యం బ్రాండ్ల కారణంగా వేలాది కుటుంబాలు నష్టపోయాయని ఆరోపించారు.

అదేవిధంగా మెగా డీఎస్సీ ద్వారా 16,500 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసిన విషయంలోనూ ప్రతిపక్షం అసత్య ప్రచారం చేస్తోందని పార్థసారథి విమర్శించారు. అధికారులు వివరణలు ఇస్తున్నప్పటికీ ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం కొనసాగుతోందని అన్నారు.

కాగా, లిక్కర్‌ కేసులో దర్యాప్తు సంస్థలు పలు ఆర్థిక అక్రమాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నాయి. ఈ కేసుకు సంబంధించి ఈడీ ఇప్పటికే రూ.441.63 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్‌ చేసినట్లు ప్రకటించింది.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *