బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా ప్రాంతాల్లో భారీ వర్షాలతో పాటు బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచిస్తోంది. తెలంగాణలోనూ పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అత్యవసరమైతే తప్ప వర్షాలు, ఈదురుగాలుల సమయంలో బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. ఉత్తర అండమాన్ సముద్రం, పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడినట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.
ఈ అల్పపీడనం పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ క్రమంగా బలపడే అవకాశం ఉందని వెల్లడించారు. సోమవారం నాటికి ఇది తూర్పు మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా, మంగళవారం నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వివరించారు.
అనంతరం బుధవారం ఉదయానికి పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ దక్షిణ ఒడిశా–ఉత్తరాంధ్ర తీరాలకు సమీపంలోని పశ్చిమ మధ్య, దానికి ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం ప్రాంతానికి చేరుకునే అవకాశం ఉందని తెలిపారు. ఈ వ్యవస్థ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాల పరిస్థితిపై అధికారులు ఎప్పటికప్పుడు అప్డేట్లు ఇస్తున్నారు.
ఉపరితల ఆవర్తనం నుంచి మధ్య బంగాళాఖాతం మీదుగా ఉత్తర కోస్తాంధ్ర వరకు ఒక ద్రోణి కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అలాగే ఉత్తర కోస్తాంధ్ర నుంచి తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు మరో ద్రోణి విస్తరించి ఉన్నట్లు పేర్కొంది. వీటి ప్రభావంతో ఆదివారం (సెప్టెంబర్ 20) రాష్ట్రంలో మేఘావృతమైన వాతావరణం కొనసాగడంతో పాటు పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అల్పపీడనం ప్రభావంతో సోమవారం నుంచి నాలుగు రోజుల పాటు కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా, తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది.
తెలంగాణలో పలు జిల్లాలకు వర్ష సూచన
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు నాలుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మరో 9 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో పాటు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.
ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. సముద్రం తీవ్ర అల్లకల్లోలంగా మారే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని, ఇప్పటికే సముద్రంలో ఉన్న వారు వెంటనే సురక్షితంగా తీరానికి చేరుకోవాలని అధికారులు సూచించారు.
