రాష్ట్రంలో స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్ల దుర్వినియోగంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (SAAP) కీలక నిర్ణయం తీసుకుంది. స్పోర్ట్స్ కోటా కింద ప్రవేశాలు పొందే అభ్యర్థుల కోసం తొలిసారిగా స్కిల్ టెస్ట్ నిర్వహించనుంది. 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన..

ఆంధ్రప్రదేశ్‌లో స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్ల దుర్వినియోగంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (SAAP) కీలక నిర్ణయం తీసుకుంది. స్పోర్ట్స్ కోటా కింద ప్రవేశాలు పొందే అభ్యర్థుల కోసం తొలిసారిగా స్కిల్ టెస్ట్ నిర్వహించనుంది. 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన AP EAPCET (ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) ప్రవేశాల్లో స్పోర్ట్స్ కోటాను వినియోగించుకునే అభ్యర్థులకు ఈ నెల 21న గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో స్కిల్ టెస్ట్ నిర్వహించనున్నట్లు SAAP సెప్టెంబర్ 18న ప్రకటించింది. స్పోర్ట్స్ కోటా కింద ప్రవేశాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరూ తప్పనిసరిగా ఈ పరీక్షకు హాజరుకావాలని SAAP స్పష్టం చేసింది. నిపుణుల పర్యవేక్షణలో అభ్యర్థుల క్రీడా నైపుణ్యాలను పరీక్షించనున్నారు.

ఇంజినీరింగ్ ప్రవేశాల్లో 0.5 శాతం స్పోర్ట్స్ కోటా

ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్ ప్రవేశాల్లో 0.5 శాతం స్పోర్ట్స్ కోటా అమల్లో ఉంది. 2026–27 విద్యా సంవత్సరానికి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,50,828 ఇంజినీరింగ్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ రిజర్వేషన్ ప్రకారం సుమారు 754 సీట్లు స్పోర్ట్స్ కోటా కింద భర్తీ చేసే అవకాశం ఉంది. అయితే కన్వీనర్ కోటా, కళాశాల, కోర్సుల వారీగా అందుబాటులో ఉన్న సీట్ల ఆధారంగా తుది కేటాయింపు జరుగుతుంది. స్పోర్ట్స్ కోటా ప్రయోజనం పొందాలంటే అభ్యర్థి ఆంధ్రప్రదేశ్ తరఫున ప్రాతినిధ్యం వహించి ఉండాలి. సంబంధిత అసలు క్రీడా ధ్రువపత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ప్రొఫెషనల్ కోర్సుల ప్రవేశాలకు గుర్తింపు పొందిన క్రీడల్లో అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాస్కెట్‌బాల్, బాక్సింగ్, చెస్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, జూడో, కబడ్డీ, ఖో-ఖో, షూటింగ్, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, టెన్నిస్, వాలీబాల్, వెయిట్‌లిఫ్టింగ్, రెజ్లింగ్ తదితరాలు ఉన్నాయి. అయితే కొన్ని క్రీడా సంఘాలు నకిలీ ధ్రువపత్రాలు జారీ చేశాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్ 21న స్కిల్ టెస్ట్ నిర్వహించేందుకు SAAP చర్యలు చేపట్టింది.

స్పోర్ట్స్ కోటాలో అక్రమాల ఆరోపణలు.. మెగా DSCతో వెలుగులోకి వచ్చిన వ్యవహారం

గత ఏడాది ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించిన మెగా DSC 2025 నియామకాల్లోనూ స్పోర్ట్స్ కోటా అంశం వివాదాస్పదమైంది. కేవలం పార్టిసిపేషన్ సర్టిఫికెట్ల ఆధారంగా కొందరికి ఉద్యోగాలు లభించాయని, ఉద్యోగాలు పొందిన వారిలో అసలు పతక విజేతలు చాలా తక్కువగా ఉన్నారని ఆరోపణలు వచ్చాయి. క్రీడా సంఘాలు జారీ చేసిన ధ్రువపత్రాలు, అభ్యర్థుల స్వీయ ప్రకటనల ఆధారంగా నకిలీ క్రీడాకారులు ఉద్యోగాలు పొందారని ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ ఆరోపించింది. ఈ అంశంపై దర్యాప్తు కోరుతూ ఆ సంఘం హైకోర్టును ఆశ్రయించి ప్రజాప్రయోజన వ్యాజ్యం (PIL) దాఖలు చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో స్పోర్ట్స్ కోటా అమల్లోకి వచ్చినప్పటి నుంచే వైద్య, సాంకేతిక విద్యా ప్రవేశాల్లో అక్రమాల ఆరోపణలు ఉన్నట్లు తెలుస్తోంది. గత కొన్నేళ్లుగా ఇంజినీరింగ్, మెడికల్, MBA, MCA వంటి కోర్సుల్లో అనర్హులు, నకిలీ క్రీడాకారులు స్పోర్ట్స్ కోటా ద్వారా ప్రవేశాలు పొందారనే ఆరోపణలు వచ్చినప్పటికీ సమగ్ర దర్యాప్తు జరగలేదనే విమర్శలు ఉన్నాయి. 2017 ఆగస్టులో మెడికల్ ప్రవేశాల్లో నకిలీ క్రీడా ధ్రువపత్రాల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీనిపై స్క్రూటినీ కమిటీ నివేదికను అప్పటి SAAP VC-MDకి సమర్పించింది. ఆ దర్యాప్తు ఆధారంగా వైద్య సీటు పొందిన రిత్విక్ రెడ్డి అనే విద్యార్థిని ఫైనల్ పరీక్షలకు హాజరుకాకుండా విజిలెన్స్ అధికారులు అడ్డుకున్నట్లు సమాచారం. మరో యువతి హాసిని రెడ్డి కూడా నకిలీ ధ్రువపత్రంతో మెడికల్ సీటు పొందినట్లు గుర్తించారు.

By Hemanth

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *