
ఆంధ్రప్రదేశ్‌లో క్యాన్సర్ రోగులకు కీలక వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రంలో తొలిసారిగా అధునాతన జన్యు పరీక్షలు నిర్వహించేందుకు గుంటూరు జీజీహెచ్ ప్రాంగణంలోని నాట్కో క్యాన్సర్ కేర్ సెంటర్‌లో ప్రత్యేక ల్యాబ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 22 నుంచి ల్యాబ్ సేవలు ప్రారంభం కానున్నాయి.
సుమారు రూ.2.5 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న ఈ ల్యాబ్‌కు అవసరమైన పరికరాలను ఇప్పటికే సమకూర్చారు. తొలుత రొమ్ము, ఊపిరితిత్తుల క్యాన్సర్ రోగులకు అవసరమైన జన్యు పరీక్షలు నిర్వహించనున్నారు. రోగుల నుంచి సేకరించిన శాంపిల్స్‌ను పరీక్షించి కణాల్లో చోటుచేసుకున్న జన్యు మార్పులను గుర్తిస్తారు. పరీక్షల ఫలితాల ఆధారంగా రోగికి ఎలాంటి చికిత్స అందించాలనే దానిపై వైద్యులు నిర్ణయం తీసుకుంటారు.
ప్రస్తుతం రాష్ట్రంలోని క్యాన్సర్ రోగుల జన్యు పరీక్షల కోసం శాంపిల్స్‌ను బెంగళూరు, ముంబై వంటి నగరాలకు పంపిస్తున్నారు. ఇకపై గుంటూరులోనే ఈ పరీక్షలు అందుబాటులోకి రానుండటంతో రోగులకు సమయం, ఖర్చు ఆదా కానుంది.
ప్రైవేట్ ల్యాబొరేటరీల్లో ఒక్కో జన్యు పరీక్షకు సుమారు రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు, పూర్తి స్థాయి పరీక్షలకు రూ.75 వేల వరకు ఖర్చవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే గుంటూరు జీజీహెచ్‌లో ఈ పరీక్షలను రోగులకు ఉచితంగా అందించనున్నారు.
జన్యు పరీక్షల ద్వారా రోగ నిర్ధారణ నుంచి చికిత్స, అనంతరం పర్యవేక్షణ వరకు వైద్య సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు ఈ విధానాన్ని ఉపయోగించనున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆస్ట్రాజెనెకా, స్ట్రాండ్ లైఫ్ సైన్సెస్ భాగస్వామ్యంతో ఈ ల్యాబ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 22న వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ల్యాబ్‌ను ప్రారంభించనున్నారు.
